నగర ప్రయాణికులకు అందుబాటులోకి ప్రత్యేక యాప్
హైదరాబాద్ జూలై 20: నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి బస్సు ప్రయాణికులకు తెలిసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా నగర ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఏ మార్గంలో ఏ బస్సు ఎక్కడా ఉన్నది? ఏ ప్రాంతంలో ఉన్నది? ఎన్ని గంటలకు తాము వేచి ఉన్న బస్‌స్టాప్‌నకు బస్ చేరుకుంటుంది? ఈ మార్గంలో ఎన్ని బస్సు సర్వీసులు ఉన్నాయి? అనే సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి యాప్‌ను ఆర్టీసీ అధికారులు రూపొందించారు.ఈ యాప్‌ను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో అన్ని బస్సుల్లోనూ వర్తింపజేయాలన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్ సిస్టం పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉన్నది.
అయితే అవసరమైన వివరాలు టైప్ చేస్తే బస్సులు, బస్టాండ్లు, సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ యాప్ ద్వారా సిటీ బస్సుల లైవ్ లొకేషన్ తెలుస్తుందన్నారు. జీపీఎస్ విధానంలో బస్సులు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం నగరంలో 800 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ట్రాకింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలుపరుస్తుండగా.. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సు కోసం ఎంతసేపు బస్టాండ్‌లో ఎదురు చూడాలనే దానిపై ప్రయాణికులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సేవలను ప్రస్తుతం నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, వీలైనంత త్వరలోనే నగరంలో అన్ని ఆర్డినరీ బస్సుల్లోనూ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో 800 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులతోపాటు నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 1600 ఆర్డినరీ బస్ సర్వీసుల్లో కలిపి మొత్తం 2,400 బస్సులను ట్రాక్ చేయడానికి టీఎస్ ఆర్టీసీ యాప్ సహాయం చేస్తుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడ్డారు.