A place where you need to follow for what happening in world cup

టమాటా ద్వారా ఇప్పుడు రూ.3 కోట్లు వచ్చాయి… కానీ లక్షలు నష్టపోయా!: పుణే రైతు

  • జూన్ 11 నుండి జూలై 18 మధ్య రూ.3 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించిన ఈశ్వర్
  • మిగిలిన 4వేల టమాటా ట్రేలతో మరో రూ.20 లక్షలు వస్తాయన్న రైతు
  • రెండేళ్ల క్రితం రూ.16 లక్షల వరకు నష్టపోయినట్లు వెల్లడి

టమాటా ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతుండగా, కొంతమంది రైతులకు పంట పండిస్తోంది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన రైతు ఈశ్వర్ గయ్కార్ నెల రోజుల్లోనే రూ.3 కోట్లు ఆర్జించి, కోటీశ్వరుడయ్యాడు. పూణె జిల్లాలోని జున్నార్ తహసీల్‌లోని పచ్‌ఘర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల ఈ రైతుకు ఈ ఏడాది మే నెలలో ధర తక్కువగా ఉండటంతో మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మడమే కష్టంగా మారింది. పెద్ద మొత్తంలో టమాటా పంటను వేశాడు. కానీ ధర తక్కువగా ఉంది. అంతమొత్తాన్ని తీసుకు వెళ్లడం అతనికి ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ తన 12 ఎకరాల పొలంలో టమాటా సాగును అలాగే కొనసాగించాడు.

ఆ తర్వాత జూన్ నెల నుండి టమాటా ధరలు క్రమంగా పెరుగుతుండటంతో అతని పంట పండింది. దీంతో జూన్ 11 నుండి జూలై 18 మధ్య టమాటా పంట దిగుబడి ద్వారా అతను ఏకంగా రూ.3 కోట్లు ఆర్జించాడు. ఇది అతనిని మిలియనీర్ గా మార్చింది.

అతను పీటీఐతో మాట్లాడుతూ… జున్నార్ తహసీల్‌లోని నారాయణగావ్‌లోని వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసి)లో ఈ నెల రోజుల కాలంలో 18,000 డబ్బాల టమాటాలను విక్రయించాడు. ఒక్కో డబ్బా లేదా ట్రేలో 20 కిలోల వరకు టమాటాలు ఉంటాయి. దాదాపు మరో 4వేల డబ్బాలు ఉన్నాయని, వీటిని విక్రయించడం ద్వారా మరో రూ.50 లక్షలు వస్తాయని చెబుతున్నాడు.

తనకు రవాణా ఖర్చుతో మొత్తం కలిపి సాగు కోసం అయిన ఖర్చు నలభై లక్షల రూపాయలు అయిందని చెప్పారు. తనకు 18 ఎకరాల పొలం ఉందని, అందులో 12 ఎకరాల్లో టమోటా సాగు చేశానని, జూన్ 11 నుండి 18 వేల డబ్బాలను విక్రయించి ఇప్పటి వరకు రూ.3 కోట్లు ఆర్జించానని తెలిపాడు. జూన్ 11న ఒక్కో డబ్బా ధర రూ.770 (కిలో రూ.37 నుండి రూ.38) ఉండగా జూలై 18వ తేదీ నాటికి రూ.2,200 (కేజీ రూ.110)కు పెరిగిందని చెప్పాడు.

టమాటాపై మంచి ఆదాయం వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. తక్కువ ధరల కారణంగా రెండు నెలల క్రితమే టమాటాను పారబోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ధరలు పెరగడంతో కలిసి వచ్చిందన్నాడు.

‘టమాటాను పండించేవారికి ఇది మంచి సమయం. కానీ మేము కూడా దారుణమైన పరిస్థితులను చూశాం. మే నెలలో ఒక ఎకరం భూమిలో నేను టమోటాలు పండించాను. కానీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున పెద్ద మొత్తంలో ఉత్పత్తులను పారబోయవలసి వచ్చింది. ఒక్కో ట్రే లేదా డబ్బా ధర అప్పుడు కేవలం రూ. 50. అంటే కిలో రూ.2.50. కాబట్టి రవాణా ఖర్చు కూడా రాదు. కాబట్టి పారబోయవలసి వచ్చింది.’ అన్నాడు. 2021లోనూ తాను రూ.15 లక్షల నుండి రూ.16 లక్షల వరకు నష్టపోయానని, గతేడాది కూడా కేవలం స్వల్ప లాభాన్ని ఆర్జించానని చెప్పాడు.

మే నెలలో తాను టమాటాలు పారబోసిన సమయంలో 12 ఎకరాల్లో సాగు చేశానని, ఎదురు దెబ్బ తగిలినప్పటికీ మనోనిబ్బరంతో వ్యవసాయం చేశానని, ఇప్పుడు లాభం వచ్చిందన్నాడు. నాలాంటి రైతు కష్టపడి పని చేయడం వల్ల ఇప్పుడు బాగా లాభపడ్డాడని చెప్పాడు.

Leave A Reply

Your email address will not be published.