- పొంగులేటికి చెక్..అనుచరులకు షాక్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 రీచ్ లను నిలిపివేయాలని సీఎంఓ ఆదేశం
- రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ లోడ్ లకు బ్రేక్
- ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ
- లోడింగ్ పాయింట్లను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు
- కొత్త ఇసుక పాలసీ కోసం అడుగులు
ఇసుక తుఫాన్ -2
ఇసుక మాఫియాపై సీఎం రేవంత్ రెడ్డి కొరఢా ఝులిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొంగులేటి అనుచరులు చేజిక్కించుకున్న 17 ఇసుక రీచ్ లలో తవ్వకాలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం టీజీఎండీసీ అధికారులను ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ లోడ్ లు నిలిపివేయాలని, అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. సీఎం నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది. ఇసుక మాఫియా ఆగడాలతోనే గత ప్రభుత్వం అపఖ్యాతి పాలయిందని రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించారు. మైనింగ్ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం ఇసుక మాఫియా, రాజకీయ నేతల ప్రమేయంపై అధ్యయనం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించిన ఇసుక రీచ్ లను మంత్రి తన అనుచరులకుకట్టబెట్టడం వివాదాస్పదం కావడం, ఈ వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందని స్పష్టం కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తున్నది.
ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరువస్తుందని భావించిన సీఎం ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, మాఫియాను కట్టడి చేయడం, అక్రమ రవాణా అరికట్టడం ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందించాలని నిర్ణయించారు. ప్రస్తుత విధానంలో మార్పులు తీసుకురావడానికి ఉన్నత స్థాయి అధికారుల కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది.
కలెక్టర్ల తీరుపై కూడా చర్చ..
నిబంధనల ప్రకారం వ్యవహరించవలసిన జిల్లా కలెక్టర్లు ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలం కావడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. జిల్లా ఇసుక కమిటీల చైర్మన్ లుకా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లకు ఇసుక రీచ్ ల మంజూరి, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వారు పట్టించుకోక పోవడంతో మాఫియా మరింత చెలరేగి పోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పనిచేయవలసిన రాష్ట్ర స్థాయి ఇసుక కమిటీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సారి కూడా సమావేశం కాకపోవడం విశేషం. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు టీజీఎండీసీకి అప్పగించగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు ఎండీలను మార్చడం వెనుక కూడా ఒక మంత్రి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఫలితంగా టీజీఎండీసీలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆలస్యంగా మేల్కున్న సీఎం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇసుక మకిలి అంటకుండా చూడాలని కింది స్థాయి కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.