- ఇసుక మాఫియా కట్టడికి రేవంత్ ఆదేశం
- అమాత్యుడి అనుయాయులే ఇసుక మాఫియాగా మారిన వైనం
- బినామీ కాంట్రాక్టర్లుగా రంగ ప్రవేశం
- భద్రాద్రి జిల్లాలో 17 రీచ్ లు కైవసం
- అధికార యంత్రాంగం దాసోహం
- అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం
ఇసుక తుఫాన్ -1
ఇసుక మాఫియాను కట్టడి చేయడం, అక్రమ రవాణాను అరికట్టడం కోసం సీఎం రేవంత్ చేస్తున్న ప్రయత్నానికి నంబర్ టూగా ప్రచారం చేసుకుంటున్న మంత్రి ప్రతిబంధకంగా మారారు. పారదర్శక విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేయడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచాలనే దిశగా సీఎం అడుగులు వేస్తుంటే ఇసుక మంత్రిగా పేరు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా మంత్రి తన అనుచరులకు దొడ్డిదారిలో 17 రీచ్ లను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఏ రీచ్ ఎవరికి ఇవ్వాలో స్వయంగా మంత్రి నిర్ణయించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం కోసం ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలకమైన సూచనలు చేశారు. కొత్త ఇసుక విధానం రూపొందించడం కోసం ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్టారావు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి శశాంక సభ్యులుగా ఏర్పడిన ఈ కమిటీ పారదర్శక విధానం కోసం కసరత్తు చేస్తుండగా మంత్రి మనుషులు అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండగా ఈ ప్రాంతమంతా ఏజెన్సీలో ఉంది. ఇసుక తదితర చిన్నతరహా ఖనిజాలను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించవలసి ఉంది. గ్రామసభల ద్వారా అర్హత కలిగిన సహకార సంఘాన్ని ఎంపిక చేసి ఇసుక రీచ్ ని ఆదివాసీలే స్వయంగా నిర్వహించుకోవలసిందిగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికి భిన్నంగా గత పదేండ్లుగా ఇసుక రీచ్ లను బినామీ కాంట్రాక్టర్లే దక్కించుకుంటున్నారు. ఆదివాసీ సహకార సంఘాలకు పెట్టుబడి లేక పోవడంతో బినామీ కాంట్రాక్టర్లతో అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నది. బినామీలను అరకట్టవలసిన జిల్లా కలెక్టర్లు కూడా మాఫియాతో అంటకాగుతున్నారు. బినామీ ఇసుక కాంట్రాక్టర్ల వ్యవహారంతోనే గత ప్రభుత్వం అప్రదిష్ఠపాలు కాగా కొందరు ఎమ్మెల్యేలకు కూడా మకిలి అంటింది. ప్రజలు వారిని ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిని ఇసుక విధానంలో ఎటువంటి మార్పులు తీసుకు రాలేక పోయింది. ఇదే అదనుగా భావించిన ఖమ్మం జిల్లా మంత్రి ఇసుక వ్యవహారంలో తల దూర్చి అపఖ్యాతి పాలయ్యారు. మంత్రి ఇసుక వ్యవహారం అధిష్ఠానం వరకూ వెళ్ళింది. మంత్రి ఇసుక దందాపై సీఎంకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందినా ఆయన నోరు మెదపడం లేదు.
భద్రాద్రి జిల్లా లో గోదావరి నదిపై గత ప్రభుత్వం మంజూరు చేసిన సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణాన్ని ఎన్జీటి నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్జీటి స్టే వెకేట్ చేయించడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. నిర్మాణమే పూర్తి కాని ఈ బ్యారేజీకి పూడిక పేరుతో ఇసుక రీచ్ లను మంజూరు చేయించిన మంత్రి తన అనుయాయులకు వీటిని కట్టబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. చర్ల మండలంలో దాదాపు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను పూడిక పేరుతో తీసే అనుమతులు రాగా మంత్రి అనుచరులైన ఇద్దరు వ్యక్తులు వీటిని దక్కించుకున్నారు. జీరో వ్యాపారంతో పాటు, ఓవర్ లోడింగ్ కు పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా బయట కూడా తవ్వకాలు చేపట్టారు. ఇదే జిల్లాలో గత సంవత్సరం సర్వే పూర్తి చేసిన మరో 17 ఇసుక రీచ్ లను మంత్రి తన మనుషులకు పంపకాలు చేశారు.
అన్ని అనుముతులూ వచ్చిన ఈ రీచ్ లను నాలుగు నెలల కాలం పెండింగ్ లో పెట్టించి చివరిని ఎవరికి ఏది కేటాయించాలో ఇటీవల నిర్ణయించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీచ్ ల ను దక్కించుకున్న వారిలో ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. 17 రీచ్ లలో మంత్రికి 40 శాతం వాటా ఉందంటూ కాంట్రాక్టర్లు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఇసుక రీచ్ లలో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా వాటా ఉందనే వార్త ఇటీవల జిల్లాలో గుప్పుమంది. మంత్రి అండదండలతో నడుస్తున్న ఇసుక రీచ్ ల వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడటం లేదు. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల వద్ద నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు.