బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్ నిరాకరించి షాకిచ్చారు. దాంతో తుమ్మల అనుచరులు రహస్య సమావేశం నిర్వహించారు. ఖమ్మం సత్యనారాయణపురంలోని టిసివి రెడ్డి ఫంక్షన్ హాల్ లో తుమ్మల అనుచరులు మంగళవారం సమావేశమయ్యారు. పాలేరులో తుమ్మల పోటీ చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. సీఎం కేసీఆర్ తనకు పాలేరు టికెట్ ఇస్తారని మాజీ మంత్రి తుమ్మల ఆశించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన తుమ్మల ఓటమి చెందడం తెలిసిందే. అనంతరం కందాల బీఆర్ఎస్ లో చేరిపోయారు. అక్కడే తుమ్మలకు తలనొప్పి మొదలైంది. కానీ సర్వేలు చూసినా తుమ్మలకే మొగ్గు, టికెట్ కన్ఫా్మ్ అని రావడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. కానీ పాలేరు స్థానాన్ని సిట్టింగ్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ కేటాయించింది. దాంతో తుమ్మల భవిష్యత్ రాజకీయ పరిణామాలపై అనుచరుల సమాలోచనలు జరుపుతున్నారు.
పాలేరు నియోజవర్గ స్థాయిలోని ప్రధాన అనుచరులు సమావేశమై తుమ్మల పాలేరు నుంచి బరిలోకి దిగడం సరైనదిగా ఫిక్సయ్యారు. జిల్లాలోని తుమ్మల మద్దతుదారులు, అభిమానులు మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలనుకుంటున్నారు. మరోసారి సమావేశం తరువాత తుమ్మలను నిర్ణయం తీసుకోవాలని కొరతామని ప్రకటించారు. నేడు జరిగిన సమావేశంలో పాలేరు అడ్డా తుమ్మల గడ్డ అంటూ తుమ్మల నాగేశ్వరరావు మద్దుతుదారులు నినాదాలు చేశారు. దాంతో పాలేరు రాజకీయాలు వేడేక్కేలా కనిపిస్తున్నాయి. కొందరు నేతలు ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లి తుమ్మలను కలిసి ఎన్నికల్లో పోటీ, పార్టీ మారాలా వద్దా అనే విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.బీర్ఆర్ఎస్ అభ్యర్థిగా తాను మరోసారి పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమని ఇటీవల దీమా వ్యక్తం చేసిన తుమ్మలకు పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.
ఎన్నికల్లో విజయం సాధించాక గోదావరి జలాలతో పాలేరును సస్యశ్యామలం చేస్తానని తుమ్మల అనండంతో ఆయన టికెట్ కన్ఫామ్ అయిందని అంతా భావించారు. అనూహ్యంగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడంతో పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతోందని చర్చ మొదలైంది.సీఎం కేసీఆర్ మొత్తం 115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించారు. అందులో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. వేములవాడ, స్టేషన్ ఘనపూర్ లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చెన్నమనేని రమేష్ బాబు, తాటికొండ రాజయ్యలకు సైతం కేసీఆర్ షాకిచ్చారు. ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎల్బీ నగర్ – సుధీర్ రెడ్డి, మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి, తాండూరు – పైలెట్రోహిత్రెడ్డి, ఎల్లారెడ్డి – జాజాల సురేందర్, నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య, కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్రావు, పాలేరు – కందాల ఉపేందర్రెడ్డి, భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి , పినపాక – రేగా కాంతారావు, ఇల్లెందు – హరిప్రియా నాయక్, కొల్లాపూర్ – హర్షవర్ధన్ రెడ్డి పేర్లను బీఆర్ఎస్ ఖరారు చేసింది. వీరిలో బోథ్ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మత్రమే.. టిక్కెట్ నిరాకరించారు.