A place where you need to follow for what happening in world cup

తమిళనాడు గవర్నర్ గా రజనీకాంత్ ?

సూపర్‌ స్టార్ రజనీకాంత్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి తలైవా అని పిలిపించుకునే లెజెండరీ నటుడాయన. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన రజనీ.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వెండితెర మీద అలరించిన రజినీకి.. ఇప్పుడు నిజ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవి దక్కబోతోందని తమిళ నాట జోరుగా ప్ర‌చారమ‌వుతోంది. త్వరలోనే ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వరించనుందని టాక్ వినిపిస్తోంది.రజనీకాంత్ ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘జైలర్’ సక్సెస్ తర్వాత ఆధ్యాత్మిక యాత్రకు హిమాలయాలకు వెళ్లిన రజనీ.. తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సహా కొందరు రాజకీయ నేతలను కలిశారు.

ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి మరీ ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులోని ప‌లువురు నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ను బీజేపీ ప్రభుత్వం గవర్నర్ గా నామినేట్ చేయనుందని.. అది కూడా తెలంగాణా రాష్ట్రానికి గవర్నర్ ను చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న రజనీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రజనీకి గవర్నర్ గిరి కట్టబెట్టడం ద్వారా దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపేతానికి ఆయన చరిష్మా కలిసి వస్తుందని అగ్రనాయకత్వం భావిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు దగ్గర ప్రస్తావించగా, రజనీ రాజకీయాల్లోకి రారని చెప్పారు. ర‌జనీకి గవర్నర్‌ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామని అన్నారు. ర‌జనీ సైతం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని తిర‌స్క‌రించ‌ర‌ని అన్నారు.

సూపర్ స్టార్ ఇటీవ‌ల ప‌లువురు బీజేపీ రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌డం, ఆయన సోదరుడి వ్యాఖ్య‌లు రజనీకి గవర్నర్ గిరి అనే ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బీజేపీ హయాంలోనే రజనీకాంత్ కు భారతీయ సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్ దక్కిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.నిజానికి ర‌జ‌నీకాంత్‌ గతంలోనే పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేసుకున్నారు. అభిమానుల‌తో కూడా స‌మావేశాలు నిర్వహించి చివ‌ర‌కు ఉసూర‌మ‌నిపించారు. తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని ప్రకటించారు. పాలిటిక్స్ లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఇన్నాళ్లకు మళ్లీ తలైవా పొలిటికల్ కెరీర్‌పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈసారి గవర్నర్ పదవి దక్కనుందిని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.