కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి సెప్టెంబర్ 7న ఏడాది పూర్తి అవుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ జనంతో మమేకమయ్యారు. జోడో యాత్ర తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర 2పై అప్ డేట్ ఇచ్చింది. త్వరలోనే రెండో దఫా యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసింది. రెండో దశ యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ త్వరలోనే వెల్లడించాలని పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది. 2022 సెప్టెంబర్ 7 ప్రారంభం అయిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఏడాది జనవరి 30 వరకు కొనసాగింది. కన్యాకుమారిలో మొదలుపెట్టిన తొలి దశ జోడో యాత్ర ఈ జనవరి 30న కాశ్మీర్ లో రాహుల్ విజయవంతంగా పూర్తి చేశారు.
మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. 145 రోజుల పాటు కొనసాగిన తొలి విడత భారత్ జోడో యాత్రలో 75 జిల్లాల్లో పాదయాత్ర చేయగా.. 76 లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేశారు. 100 కార్నర్ మీటింగ్స్ నిర్వహించగా, 275 చోట్ల వాకింగ్ ఇంటరాక్షన్, 12 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ భావజాలాన్ని స్పష్టం చేశారు.తమిళనాడులో మొదలుపెట్టిన రాహుల్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ వరకు కొనసాగింది. అత్యధికంగా ఎన్నికలు జరిగిన కర్ణాటకలో 21 రోజులు పాదయాత్ర చేశారు రాహుల్. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అత్యల్పంగా హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కరోజు, ఢిల్లీలో రెండు రోజులు రాహుల్ పాదయాత్ర చేశారు.
ఏపీలో 4 రోజులు, తెలంగాణలో 12 రోజులపాటు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ పార్టీ కీలక నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చించారు2024 లోక్‌సభ ఎన్నికలు ఇంక మిగిలుంది 6 నెలలు మాత్రమే. దాంతో కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఇటీవల తెలిపారు. రాహుల్ యాత్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దాంతో రెండో విడత భారత్ జోడో యాత్రకు హైకమాండ్ గట్టిగానే ప్లాన్ చేస్తోందని నేతలు చెబుతున్నారు. తొలి విడత యాత్రలో దక్షిణం నుంచి ఉత్తరానికి రాహుల్ పాదయాత్ర చేశారు. త్వరలో ప్రారంభం కానున్న రెండో విడతలో పశ్చిమ నుంచి తూర్పు వైపుగా రాహుల్ గాంధీ యాత్ర సాగేలా పార్టీ పెద్దలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ లో రెండో విడత యాత్ర ఉంటుందని రెండు నెలల కిందటే కాంగ్రెస్ నేతలు చెప్పినా ఇప్పటివరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలపై కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.