అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్
న్యూఢిల్లీ జూలై 26:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ లోక్‌సభలో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేవలం 13 రోజులు(వర్కింగ్ డేస్) మాత్రమే ఉన్నాయి. అయితే పద్ధతి ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చను షెడ్యూల్ చేసేందుకు లోక్‌సభ స్పీకర్ 10 రోజలు సమయాన్ని తీసుకునే వీలుంది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. సుమారు 50 మంది ఎంపీలు ఆ నోటీసులపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభల్లోనూ మణిపూర్ అంశంపై రభస కొనసాగింది. రెండు సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమావేశమైన లోక్‌సభలో.. స్పీకర్ ఓం బిర్లా .. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు.
అవిశ్వాస తీర్మానాన్ని గగోయ్ సభలో ప్రవేశపెట్టారు. దానికి స్పీకర్ స్పందిస్తూ త్వరలో చర్చ తేదీ, సమయాన్ని వెల్లడించనున్నట్లు చెప్పారు.మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమే అని కేంద్రం అంటోంది, కానీ చర్చను తీసుకురావడం లేదని కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ తెలిపారు. ప్రధాని మోదీ సభకు రావడం లేదని, ఆయన తన చాంబర్‌లో కూర్చుంటున్నారని, కేవలం మీడియాతో మాత్రమే మాట్లాడుతున్నారని ఎంపీ సురేశ్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తమ వద్ద కావాల్సిన సంఖ్యా బలం ఉందన్నారు.బీఎస్పీ ఎంపీ మాలూక్ నగర్ లోక్‌సభలో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పై చర్చిస్తామన్నారు. మణిపూర్‌పై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. సీఎంను మార్చాలని డిమాండ్ చేశామన్నారు. రాజస్థాన్‌లో దళితులపై జరుగుతున్న దాడులు, రేప్‌ల గురించి కూడా డిస్కర్ చేయాలన్నారు.