- రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ లో ప్రశ్నిద్దాం
- తీగల వంతెన వద్దు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేయండి
- అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు ఆపాలి
- కె. సి కెనాల్, తెలుగుగంగా,, ఎస్ ఆర్ బి సి రైతుల ఆయకట్టుకు జూన్ మొదటి వారం లోనే సాగునీరు విడుదల చేయాలి
నంద్యాల:రాయలసీమకు రావాల్సిన నీళ్ళు,నిధులు,నియామకాలలో సమాన వాటా కోసం, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రాయలసీమ ప్రాంత అభివృద్దే ఏకైక లక్ష్యముగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డి అన్నారు.బుధవారం నంద్యాల నుండి వందలాది మంది రైతులు, యువకులు, విద్యార్థులు భారీ వర్షాలును లెక్కచేయకుండా స్వచ్చందంగా బైరెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఛలో ఢిల్లీ కి తరలివెళ్లారు.
ఈ సందర్బంగా నంద్యాల జిల్లా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు యం. వి. రమణారెడ్డి మాట్లాడుతూ, అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక ప్రభుత్వం కడితే కర్నూలు – కడప ( కె సి కెనాల్ ) కాలువకు చుక్క నీరు దిగువకు రాదని, ఆయకట్టు సాగుకు కాదుకదా తాగు నీటికి రాయలసీమలో కటకట ఏర్పాడుతుందన్నారు.సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన ( ఐ కానిక్ బ్రిడ్జి ) వల్ల రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మిస్తే సుమారు 70 టీఎంసీ ల నీరు ఆగి రాయలసీమ ప్రాజెక్టులకు అందుతుందని, సాగు తాగు నీటి కష్టాలు తొలగి కరువు, వలసలు ఆగుతాయన్నారు.ఇటీవల నంద్యాల జిల్లా కలెక్టర్ కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు లేదని, కేసి కెనాల్, తెలుగుగంగా, ఎస్. ఆర్. బి. సి ఆయకట్టు రైతులు వరిసాగుచేయవద్దని, వర్షాధార పంటలు ( మెట్ట పంటలు ) వేసుకోవాలని ప్రకటన చేశారని, ఇది అన్యాయమని, కృష్ణా, తుంగభద్ర నదులకు ఎగువన ఉన్న రాయలసీమ రైతుల ఆయకట్టుకు నీరు లేదు అంటున్న ప్రభుత్వం కృష్ణానదికి దిగువన ఉన్న కృష్ణా డెల్టా రైతుల నారు మడులకు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే సాగు నీరు విడుదల చేయడం రాయలసీమ రైతుల పట్ల వివక్ష కాదా అని ప్రశ్నించారు.
5 ఏళ్ల క్రితం కుంగిన అలగనూరు రిజర్వాయర్ కు మరమ్మత్తులు చేసి ఉంటే ఈ పరిస్థితి కేసి కెనాల్ కు వచ్చేది కాదని, వెలుగోడు రిజర్వాయర్ లో 15 TMC ల నీరు నిల్వ చేసుకొని ఉంటే సాగు నీరు లేదు అన్న పరిస్థితి ప్రభుత్వానికి వచ్చేది కాదన్నారు.ఈ నెల 28 న చలో ఢిల్లీ కార్యక్రమమును విజయవంతం చేసి రాయలసీమ గళాన్ని కేంద్ర ప్రభుత్వం కు వినిపించేందుకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగిన్నారు.రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించి గ్రామాల్లో దండోరా వేయించి పార్టీలకు అతీతంగా చలో ఢిల్లీకి వంద లాదిగా ఉద్యమంగా తరలి వచ్చారని,ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమ వదలిపెట్టి అభివృద్ధికి బాటలు వేసి కరువు, వలసల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.ఛలో కాశీపురం ప్రభాకర్ రెడ్డి, గొల్ల చిన్న నారాయణ, భాస్కర్, డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీమ రామిరెడ్డి, ఆళ్లగడ్డ రమేష్, కరిమద్దేల ఈశ్వర్ రెడ్డి, నరసింహ యాదవ్, లక్ష్మి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.