కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు, నగరాల పేర్లు మార్చడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారిపోయాయి. యూపీలో ఇప్పటి వరకు 40 ఊళ్ల పేర్లు, కొన్ని యూనివర్శిటీల పేర్లు మార్పు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దేశంలో ఇప్పటి వరకు ఏ నగరలా పేర్లు మారాయో చూద్దాం.ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు అనేక నగరాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాల పేర్లను మార్చారు. అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా, గుర్గావ్ పట్టణాన్ని గురుగ్రామ్‌గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చారు. అలాగే, మొఘల్ గార్డెన్‌ను- అమృత్ ఉద్యాన్‌గా, రాజ్‌పథ్- కర్తవ్యపథ్‌గా, అలహాబాద్ – ప్రయాగ్‌రాజ్‌గా, ఫిరోజ్ షా కోట్ల స్టేడియా – ఆరుణ్ జైట్లీ స్టేడియంగా, మొఘల్ సరాయ్ జంక్షన్- దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా పేరు మారింది.
త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ నగరాల పేర్ల మార్పు వ్యవహారం నడుస్తుండగానే.. మరోవైపు ఏకంగా దేశం పేరు మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా ఈ వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు కూడా చరమగీతం పాడాలనే కేంద్రం భావిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ విషయంలో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
పేర్లు.. మార్పులు..
⇒ అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా,
⇒ గుర్గావ్‌ను గురుగ్రామ్‌గా
⇒ ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా,
⇒ మొఘల్ గార్డెన్‌ను- అమృత్ ఉద్యాన్‌గా,
⇒ రాజ్‌పథ్- కర్తవ్యపథ్‌గా,
⇒ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం – ఆరుణ్ జైట్లీ స్టేడియంగా,
⇒ మొఘల్ సరాయ్ జంక్షన్- దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్,
⇒ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం,
దేశంలో పలు నగరాల పేర్లు మారుస్తూ బీజేపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇటీవల బీజేపీ- కాంగ్రెస్ మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తోంది. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును.. మోదీ ప్రభుత్వం మార్చడం వల్ల కాంగ్రెస్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్ చుట్టూ గతంలో రగడ రాజుకుంది. ఈ భవనంలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును.. ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.మొదటి నుంచి దేశంలోని పలు నగరాలకు పునః నామకరణం చేస్తూ వస్తోంది బీజేపీ.
ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చేశారు. గతంలో కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. మహారాష్ట్రలో సైతం కొన్ని నగరాల పేర్లు మారాయి. ఇక తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది. ఇలా పట్టణాలు, నగరాలకే పరిమితమైన పేర్ల ఏకంగా దేశం పేరు మార్పు వరకు వచ్చింది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మరుగున పడిఉన్న భారతదేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే.. 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న మన దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు జీ–20 సదస్సే సరైన సమయం అనుకుంది. అందుకే ఈ సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.