A place where you need to follow for what happening in world cup

100 రోజుల ముందే జాబితా….

ఎన్నికలకు వందరోజుల ముందుగానే బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించడం అనేది ఊహించని పరిణామం. షెడ్యూల్ రాకముందే బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ మల్లాగుల్లాలు పడటం మరో విశేషం. అయితే ఈ నేపథ్యంలో కష్టతరమైనటువంటి నియోజకవర్గాల జాబితాను విడుదల చేయడం వల్ల బీజేపీ ఎలాంటి సంకేతాలు పంపిందనేది పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక వ్యూహం కనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి అభ్యర్థును ముందుగానే ప్రకటించి విజయవంతమైంది కాంగ్రెస్ పార్టీ. పేర్లు ప్రకటించిన అనంతరం వెంటనే క్షేత్రస్థాయిలోకి అభ్యర్థులు బరిలోకి దిగిపోయారు. ముమ్మరంగా ప్రచారాలు చేసుకున్నారు. తమ పార్టీ అందించబోయే సంక్షేమం గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మెజార్టీ ఓట్లు రాబట్టుకోగలిగారు.

అయితే ఇప్పుడు అచ్చం అలాంటి వ్యూహాన్ని బీజేపీ అధికార మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో అనుసరిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను అలాగే ఛత్తీస్‌ఘడ్‌లో 21 మంది అభ్యర్థులను ఖరారు చేసేసింది. అయితే వీటిలో ఎక్కువగా రిజర్వ్‌డ్ సీట్లు ఉండగా.. మరికొన్ని సీట్లు గతంలో బీజేపీ ఎన్నడూ కూడా గెలవినివి. ఈ నేపథ్యంలో గెలుపు కఠినంగా అనిపించే నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు వీలు ఉంటుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. వాస్తవానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉంది. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా.. ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం ప్రతిపక్షంలో ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మంచి ఫలితాలు రాబట్టడంతో ఇప్పుడు అదే వ్యూహాన్ని బీజేపీ ప్రయోగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరో తరహా ఫార్ములాతో బీజేపీ దూసుకెళ్లేలా కనిపిస్తోేంది.వాస్తవానికి తెలంగాణలో బీజేపీ అధిష్ఠానం ఇటీవల చేసిన మార్పుతో రాష్ట్రంలోని పార్టీ కేడర్‌లో ఒక్కసారిగా ఊపు తగ్గిపోయింది. బండి సంజయ్ లాంటి నేతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని ఇప్పటికీ కూడా పార్టీ శ్రేణులు, ఆయన వర్గీయులు జీర్ణుంచుకోలేకపోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితిలో తిరిగి ఊపు తీసుకొచ్చేందుకు అధిష్ఠానం నుంచి మాత్రం పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. మధ్యప్రదేశ్, ఛత్తస్‌ఘడ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంపై వందరోజుల ముందుగానే దృష్టిపెట్టిన అధిష్ఠానం పెద్దలు.. అసలు తెలంగాణపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బీజేపీకి 35 చోట్ల తప్పితే మిగతా ప్రాంతాల్లో గట్టిగా పోటీ ఇచ్చే నాయకులు లేరట. అందుకోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ జాబితాల ప్రకటన చేసిన తర్వాత గానీ బీజేపీ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈలోపు గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.