- గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ
- ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని వ్యాఖ్య
- కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు వస్తున్నాడో తెలియడం లేదని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే తన నియోజకవర్గానికి వస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ రెండుచోట్ల ఓడిపోవడం ఖాయమన్నారు. పోటీ చేసేందుకు కామారెడ్డికి ఎందుకు వస్తున్నాడో తనకు తెలియదన్నారు. కామారెడ్డిలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తమ పార్టీ అధిష్టానం తనకు టిక్కెట్ ఇస్తే కేసీఆర్‌పై గెలుస్తానన్నారు. కామారెడ్డిలో తాను లోకల్ అన్నారు. గజ్వేల్‌పై నమ్మకం లేకే రెండేస్థానంలో పోటీ అన్నారు.
షబ్బీర్ అలీ గత మూడున్నర దశాబ్దాలుగా కామారెడ్డి నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకొని ఉన్నారు. 1989లో తొలిసారి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నారెడ్డి కేబినెట్లో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇంచార్జ్ మంత్రిగా పని చేశారు. 1994, 1999లో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుండి మరోసారి గెలిచారు. వైఎస్ కేబినెట్లో విద్యుత్, బొగ్గు, మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని చేశారు. 2009లో కామారెడ్డి నుండి ఓడిపోయారు. 2010లో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. 2014, 2018లలోను ఓడిపోయారు. ఇప్పుడు కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ మరోసారి సిద్ధమైన సమయంలో కేసీఆర్ బరిలో దిగుతుండటం గమనార్హం.