A place where you need to follow for what happening in world cup

సోషల్ వార్ కు సిద్ధమౌతున్న జనసేన

విజయవాడ, జూలై 28:జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం అతి పెద్ద కుంభకోణానికి పాల్పడుతుందని జనసేన పార్టీ ఆరోపించింది.ఈ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. వర్షాకాలంలో జగనన్న కాలనీల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టే విధంగా రాష్ట్రవ్యాప్త జనసేన పార్టీ క్యాంపెయిన్ కు పిలుపునిచ్చింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలంతా తమతమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గురువారం పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జిలు, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జగనన్న కాలనీల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి పవన్ కల్యాణ్ బయటపెట్టగా అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు గతేడాది తెలియచెప్పే ప్రయత్నం చేశాం. నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ పార్టీ నాయకులు, శాసనసభ్యులు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్ని సైతం ఆక్రమించేసి ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పేరుతో రూ.89వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని మరి ఆ కోట్లు ఎటు పోతున్నాయి అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని సీఎం వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేద్దాం అని పిలుపునిచ్చారు. రోడ్ల నిర్మాణం కూడా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకే పరిమితం అయ్యింది అని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల నుంచి రోడ్ల నిర్మాణం పేరిట డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అని చెప్పుకొచ్చారు. ప్రజలు నిరసన తెలిపితే పట్టాలు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడి మరీ బలవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం పార్టీ శ్రేణులంతా కలసి జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేయాలి అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.