A place where you need to follow for what happening in world cup

వనమా రాజకీయ శకం ముగిసినట్టేనా?

  • హైకోర్టు అనర్హత వేటుతో అనిశ్చితి
  • స్టే నిరాకరణతో నైరాశ్యం
  • సుప్రీం కోర్టుపైనే ఆశ
  • జలగం వర్గానికి జోష్ నింపిన తీర్పు
  • మలుపు తిరిగిన కొత్తగూడెం రాజకీయం

కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు రాజకీయ శకం ముగిసినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. తప్పుడు అఫిడవిట్ తో హైకోర్టులో అనర్హత వేటు పడిన వనమా సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నారు. సుప్రీం కోర్టు స్టే ఇస్తుందనే ఆశతో ఉన్నారు. తీర్పును తాత్కాలికంగా నిలిపివేసి సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళే అవకాశం ఇవ్వాల్సిందిగా హైకోర్టులో వనమా వేసిన పిటిషన్ ను కూడా కొట్టివేయడంతో షాక్ కు గురయ్యారు. మరో వైపు వనమాపై పిటిషన్ వేసి విజయం సాధించిన జలగం వెంకటరావు నేడో రేపో శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తీర్పు తర్వాత జలగం వర్గం సంబురాలు చేసుకుంటున్నది.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగాను, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేసిన వనమా అర్థంతరంగా వైదొలగ వస్తుందని ఎవరూ ఊహించలేదు. మరో ఐదు నెలల్లో పదవీ కాలం పూర్తవుతున్న వేళ అనర్హత వేటు పడడాన్ని అయన జీర్ణించుకోలేక పోతున్నారు. మరో ఐదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని హైకోర్టు తీర్పులో స్పష్టం చేయడంతో ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని ఆయన అనుయాయులు అంటున్నారు. 80 సంవత్సరాల వయస్సు ఉన్న వనమా రాష్ట్రంలోని శాసనసభ్యులందరిలో వయోధికుడు కావడం విశేషం.

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు..

వయోభారంతో పాటు కుమారుడిపై నమోదైన క్రిమినల్ కేసులతో వనమా గత కొంత కాలంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ ఇటీవల నిర్ణయించినట్టు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. హై కోర్టు తీర్పుతో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కేసీఆర్ పని సులభమైపోయింది. తన రాజకీయ వారసుడిగా కుమారుడు రాఘవేంద్రరావును తీసుకురావాలని వనమా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. నేర చరిత్రతో పాటు వివాదాస్పద నాయకుడిగా రాఘవేంద్రరావు ప్రజల చీత్కారానికి గురయ్యాడు. వనమా అనర్హత వేటు ప్రభావం రాఘవేంద్రరావుపై ఎక్కువగా పడుతుందనే అభిప్రాయం కూడా కొత్తగూడెంలో ఉంది. దళిత బంధు, బీసీలకు ఆర్థిక సాయం అందించే పథకాల్లో వనమా
పేరుతో కొందరు దళారులు భారీగా డబ్బు వసూలు చేయడంతో వారంత ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పెద్ద సంఖ్యలో వనమా ఇంటికి చేరుకుంటున్నారు.

చీకటి వెలుగుల ప్రస్థానం…

వనమా రాజకీయ జీవితం ఇతరుల కంటే కొంత భిన్నంగా సాగిందని చెప్పవచ్చు. కీర్తి వెనుకే అపకీర్తి, వెలుగు వెనకే చీకటి అలుముకున్న రాజకీయ నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందుకే అభిమానులతో సమానంగా శత్రువులు కూడా పెరిగిపోయారు. పాల్వంచ సర్పంచ్ గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఐదు దశాబ్థాల రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను చవి చూశారు. 70 వ దశకం చివరిలో రాజకీయ ప్రవేశం చేసిన వనమా జలగం వెంగళరావు అనుచరుడిగా కొంత కాలం పనిచేశారు. పాల్వంచ మేజర్ పంచాయితీ సర్పంచ్ గా పనిచేసిన వనమా అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. జలగం వెంగళరావుకు అత్యంత ఆప్తులైన స్వాతంత్ర్య సమరయోధులు పానుగంటి పిచ్చయ్య (పాల్వంచ గాంధీ) లోగాని లక్ష్మీ నర్సయ్య (మేనమామ) లసహకారంతో ఎదిగిన వనమా తర్వాత కాలంలో వారిని కూడా పట్టించుకోకుండా వివాదాస్పదంగా మారారు.

1984 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటును ఆశించిన వనమాకు అది దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి సుధాకర రెడ్డికి దక్కింది. పొంగులేటి ఓటమిలో వనమా పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు. 1989 ఎన్నికల్లో జలగం వెంగళరావు సహకారంతో కొత్తగూడెం టికెట్ ను వనమాకు కేటాయించారు. కాంగ్రెస్ గాలిలో వనమా విజయం సాధించినప్పటికీ కేవలం 250 ఓట్ల మెజారిటీ దక్కింది. ఈ ఎన్నికల్లోనే జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నేదురుమల్లి మంత్రివర్గంలో ప్రసాదరావు చిన్నతరహా పరిశ్రమలు, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. జలగం ప్రసాదరావుతో వనమాకు విభేధాలు పొడచూపాయి.

రాజకీయ భిక్ష పెట్టిన జలగం వర్గాన్ని వీడి కోట్ల విజయభాస్కర రెడ్డి వర్గంలో ఆయన చేరారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కోనేరు నాగేశ్వరరావు చేతిలో వనమా ఓడి పోయారు. 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వైద్య విధాన పరిషత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పొత్తుల కారణంగా వనమాకు టికెట్ లభించలేదు. 2014 లో కూడా కాంగ్రెస్ టికెట్ లభించక పోవడంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేయడం ద్వారా అప్రతిష్టపాలయ్యారు.

‘సన్ ’స్ట్రోక్ తో రాజకీయ పతనం..

కొత్తగూడెం నియోజకవర్గంలో వనమాకు మొదట ప్రజానాయకుడిగా పేరుండేది. పెద్ద కుమారుడు రాఘవేంద్రరావు రంగ ప్రవేశం చేయడమే కాక షాడో ఎమ్మెల్యేగా అవతరించడంతో వనమా ప్రతిష్ఠ మసకబారి పోయింది. సెటిల్మెంట్లు, అధికారులను బెదిరించడంతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాఘవేంద్రరావు ప్రజా కంటకుడిగా మారి పోవడంతో ఈ ప్రభావం వనమాపై పడింది. మహాభారతంతో ధృతరాష్ట్రుడి పాత్రను పోషించిన వనమా కొడుకును అదుపులోకి పెట్టలేక పోవడంతో రాజకీయ పతనం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వనమా ఓడిపోతారనే చర్చ సర్వత్రా జరుగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.