‘సుప్రీమ్’లో విద్యార్థుల పిటిషన్
ఘటనపై రాహుల్, కిషన్ రెడ్డి,
సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం
దిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్ దూబే సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్, ముఖర్జీనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆవేదన చెందారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వొస్తుందని వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదని రాజేంద్రనగర్ ఘటన రుజువు చేసిందని అవినాశ్ దూబే ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గత శనివారం దిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ మునిగిపోయిన ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృత్యువాతపడ్డ విషయం తెలొసిందే. కాగా దిల్లీ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతిపట్ల దిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు పాత రాజేంద్రనగర్ వద్ద కోచింగ్ సెంటర్లను ఆదివారం పరిశీలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని 13 కోచింగ్ సెంటర్లకు అధికారులు సీల్ వేశారు.