దేశంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మొత్తం 763 మందికి సంబంధించిన వివరాలు సేకరించి ఈ రిపోర్ట్‌ను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజాగా విడుదల చేసింది. ఇందులో 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇందులో 25 శాతం మందిపై హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, మహిళలపై అత్యాచారాలు వంటి కేసులు ఉన్నాయని పేర్కొంది. మొత్తం 763 మంది సిట్టింగ్ ఎంపీలలో 40 శాతం అంటే 306 మంది పార్లమెంటేరియన్లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. 25 శాతం అంటే 194 మంది సిట్టింగ్ ఎంపీలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై లైంగిక నేరాలకు సంబంధించి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ వివరాలను స్వయంగా ఆయా ఎంపీల వద్ద నుంచి తీసుకుని ఏడీఆర్ మంగళవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది.
అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి ఉన్న 776 సీట్లలో 763 మంది సిట్టింగ్ ఎంపీలు.. ఎన్నికల్లో పోటీ చేసేముందు అందించిన నామినేషన్ పత్రాల్లో ఉన్న వివరాలతో ఏడీఆర్ నివేదిక వెలువరించింది. ఇక కేరళ నుంచి ఉన్న 29 మంది ఎంపీల్లో 23 మందిపై.. బిహార్‌లో ఉన్న 56 మందిలో 41 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని 65 మంది ఎంపీల్లో 37 మందిపై.. ఇక తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని 10 మంది ఎంపీల్లో ఐదుగురిపై కేసులు ఉన్నాయి. ఇక బిహార్‌లోని 28 ఎంపీలపై.. తెలంగాణలోని 9 మంది.. కేరళలోని 10 మంది.. మహారాష్ట్రలోని 22 మందిపై.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 108 మంది ఎంపీల్లో 37 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.
ఇక పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీలోని 385 ఎంపీల్లో 139 మందిపై.. కాంగ్రెస్‌లోని 81 ఎంపీల్లో 43 మందిపై.. టీఎంసీలోని 36 మందిలో 14 ఎంపీలపై ఆర్జేడీలోని ఆరుగురిలో ఐదుగురిపై.. సీపీఎంలోని 8 మందిలో ఆరుగురిపై.. ఆప్‌లోని 11 మందిలో ముగ్గురు ఎంపీలపై.. వైసీపీలోని 31 మందిలో 13 ఎంపీలపై ఎన్సీపీలోని 8 మందిలో ముగ్గురు ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది.ఇక ఆస్తుల విషయానికి వస్తే అత్యధిక ఆస్తులు ఉన్న రాష్ట్రంగా 24 ఎంపీలుగా తెలంగాణ నిలిచింది. తెలంగాణలోని ఎంపీల సగటు ఆస్తులు రూ. 262.26 కోట్లు అని పేర్కొంది. ఏపీలోని 36 ఎంపీల సగటు ఆస్తులు రూ. 150.76 కోట్లు.. పంజాబ్‌లోని 20 ఎంపీల సగటు ఆస్తులు రూ. 88.94 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
ఇక ఎంపీల అత్యల్ప సగటు ఆస్తులు గల రాష్ట్రంగా లక్షద్వీప్ ఉంది. అందులోని ఒక ఎంపీ ఆస్తి రూ. 9.38 లక్షలు. ఇక పార్టీల వారీగా చూస్తే.. బీజేపీలోని 385 మంది ఎంపీల్లో ఒక్కోక్కరి సగటు ఆస్తులు రూ. 18.31 కోట్లు కాగా.. 81 మంది కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తులు రూ. 39.12 కోట్లుగా తేలింది. మరోవైపు.. 31 మంది వైసీపీ ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ. 153.76 కోట్లు కాగా.. 16 మంది బీఆర్ఎస్ ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ. 383.51 కోట్లుగా ఉందిఇక ఉభయసభల్లో ఉన్న 53 మంది బిలియనీర్ ఎంపీల్లో.. తెలంగాణలో ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 9, ఢిల్లీలో ఇద్దరు, పంజాబ్‌లో నలుగురు, ఉత్తరాఖండ్‌లో ఒకరు.. మహారాష్ట్రలో ఆరుగురు, కర్ణాటకలో ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇక రెండు సభల్లో ఉన్న 763 మంది సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ. 29,251 కోట్లుగా ఉందని తెలిపింది. బీజేపీకి చెందిన 385 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 7,051 కోట్లు కాగా.. 16 మంది బీఆర్ఎస్ ఎంపీలకు రూ. 6,136 కోట్లు.. 31 మంది వైసీపీ ఎంపీలకు రూ. 4,766 కోట్లు.. 81 మంది కాంగ్రెస్ ఎంపీలకు రూ. 3,169 కోట్ల ఆస్తులు ఉన్నయని ఏడీఆర్ నివేదిక వివరాలు వెల్లడించింది.