A place where you need to follow for what happening in world cup

ఐదో దశ దాటేసిన చంద్రయాన్

బెంగళూరు, ఆగస్టు1:చంద్రయాన్-3 ఇప్పుడు ఎక్కడుంది? అన్న విషయంపై ఇస్రో తాజాగా ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. భూమి కక్ష్యను వీడి, చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిందని స్పష్టం చేసింది. చంద్రయాన్-3పై మరో కీలక అప్డేట్ ఇచ్చింది ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్). ప్రస్తుతం ఈ స్పేస్క్రాఫ్ట్.. భూమి కక్ష్యను వీడి, చంద్రుడివైపు ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది.ట్రాన్స్లూనార్ ఆర్బిట్లోకి చంద్రయాన్-3ని పంపించే ప్రక్రియను పూర్తి చేశాము. ఈ ప్రక్రియను పిరేగీ- ఫైరింగ్ అని అంటారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్లో దీనిని పూర్తి చేశాము. ఫలితంగా ఈ స్పేస్క్రాఫ్ట్ భూమి చుట్టూ తిరగడం ఆపేసి, చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది,” అని మంగళవారం వెల్లడించింది ఇస్రో. అంటే.. టీఎల్ఐ మేన్యువర్తో.. స్పేస్క్రాఫ్ట్ను లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో పెట్టింది ఇస్రో. దీనితో చంద్రుడివైపు యాత్రను  మొదలుపెట్టింది చంద్రయాన్-3.ఇక తదుపరి ప్రక్రియ.. లూనార్ ఆర్బిట్లోకి స్పేస్క్రాఫ్ట్ను ఇంజెక్ట్ చేయడమే అని ఇస్రో వెల్లడించింది.

ఇది 2023 ఆగస్ట్ 5న జరగనుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ మిషన్ అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని వెల్లడించింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తామని పేర్కొంది.: చంద్రుడిపై 14రోజుల పాటు పరిశోధనల కోసం.. జులై 14న చంద్రయాన్-3ని లాంచ్ చేసింది ఇస్రో. అప్పటి నుంచి 5 దశలుగా స్పేస్క్రాఫ్ట్ ఆర్బిట్ను పెంచుకుంటూ వచ్చింది. తాజాగా.. స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడివైపు  పంపించింది.ఇప్పటివరకు చంద్రయాన్ ప్రాజెక్టులో మూడు ప్రయోగాలు చేపట్టారు. మొదటి ప్రయోగం చంద్రయాన్ 1 విజయవంతమైంది. అంతేకాకుండా.. చంద్రుడిపై నీటి జాడలున్నాయని వెల్లడించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది.

చివరి దశ అయిన ల్యాండింగ్ వరకు ఈ ప్రయోగం వెళ్లగలిగింది. కానీ చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విఫలమై, కుప్పకూలిపోయింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్వేర్ను పూర్తిగా మార్చి, చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఈ ప్రయోగంలో కీలక ఘట్టం. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఘనత అమెరికా, సోవియట్ యూనియన్, చైనా సాధించాయి. ఈసారి ప్రయత్నం సఫలం అవ్వాలని యావత్ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.