హైదరాబాద్, ఆగస్టు 1:ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తను నటిస్తున్న ‘దేవర’ హిట్ అవ్వాల్సిందే అని కష్టపడుతున్నాడు. కొన్నాళ్ల విరామం తర్వాత ‘దేవర’ నుండి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యిందంటూ మూవీ తన అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘చిన్న బ్రేక్, కొన్ని రిహార్సెల్స్ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చేశాం’ అని మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటికే ‘దేవర’ క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్.. దేవరకు మ్యూజిక్‌ను అందించనున్నాడు. అంతే కాకుండా సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు.
ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంవత్సరం క్రితం విడుదలయిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌తో పాటు ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌ల నటన కూడా ఒక కారణమే. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎన్‌టీఆర్ నటన చూసి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక అలాంటి నటన చూసిన ప్రేక్షకులు ఎన్‌టీఆర్ నుండి మరింత ఎక్కువ ఆశించడం మొదలుపెట్టడంతో తనపై ఒత్తిడి పెరిగిపోయింది.
అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో ‘దేవర’ చేయడానికి సిద్ధమయ్యాడు.కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’.. ప్రకృతి గురించి ప్రేక్షకులకు మెసేజ్ ఇస్తూనే మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. మెసేజ్‌ను మాస్ స్టైల్‌లో చూపించడం కొరటాల శివకు అలవాటే. అందుకే తనతోనే మళ్లీ సినిమా చేయడానికి ఎన్‌టీఆర్ ముందుకొచ్చాడు. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే ఇప్పటికే దేవరపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు దేవర నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తప్పా మరొక అప్డేట్ బయటికి రాలేదు.