- బిజెపి, కాంగ్రెస్‌కు బాస్ దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్
- మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు
- ఇల్లందు రెవెన్యూ డివిజన్, ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి
- పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా
- ప్రధాని మోదీకి ప్రవేట్ పిచ్చి పట్టింది
- వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
- ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్
బిజెపి, కాంగ్రెస్‌లకు దిల్లీ పెద్దలు బాస్ అయితే బిఆర్‌ఎస్ పార్టీతో పాటు తనకు తెలంగాణ ప్రజలే బాసులంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ బిజెపిలపై సెటైర్లు వేశారు. దిల్లీ గులామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బుధవారం ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం పంచాయతీ సమీప గ్రామమైన మోట్లగూడెం ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఇల్లందు అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..పోరాటాల పురిటి గడ్డ అయిన ఇల్లందును అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ప్రజలు రాజకీయ పరిణితి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పైసలకు, ప్రలోభాలకు, ఒత్తిడిలకు వోట్లను అమ్ముకోవద్దన్నారు. వోటు వేసే ముందు మన ప్రాంత అభివృద్ధిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన వోటు వజ్రాయుధం లాంటిదని, దానికి మీ ప్రాంత, మీ కుటుంబ భవిష్యత్తును, తలరాతను మార్చివేసే అంత శక్తి ఉంటుందన్నారు. ఇంత శక్తివంతమైన వోటును వేసే ముందు ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులు కాకుండా ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ శక్తిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వొస్తే 98 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ను 2000 నుండి దశలవారీగా 5000 వరకు పెంచడం, రూ 400 లకు గ్యాస్ సిలిండర్, 93 లక్షల మంది కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వంటి సంక్షేమ పథకాలను మార్చి నెల తర్వాత ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీకి ప్రవేట్ పిచ్చి పట్టింది
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందని, ఈ ప్రవేట్ మోజులో లక్షల మంది ఉద్యోగస్తులైన రైల్వే, ఇండియన్ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్‌యార్డులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందజేస్తుంటే కండ్లమంటతో వ్యవసాయ మోటర్లు మీటర్లు పెట్టాలని, లేకుంటే సంవత్సరానికి రాష్ట్రానికి అందించే 5 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేస్తానని బెదిరించారన్నారు. సంవత్సరానికి 5000 కోట్ల లెక్కన ఐదేళ్లలో రూ 25 వేల కోట్ల నష్టపోయిన మంచిదే కానీ, తన తల తెగిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. ఉచిత కరెంటు, రైతు బంధు వొద్దన్నా కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేనివిధంగా గత పాలకులు ఎవరు చేయనటువంటి రైతు సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా పథకాలను చూసి కాంగ్రెస్ నాయకులకు కండ్లు కుడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రజల నుంచి వొచ్చే టాక్స్‌లను రైతుబంధు రూపేనా రైతులకు చెల్లించడం సరికాదని ఉత్తంకుమార్ రెడ్డి అంటే, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు దండగని రేవంత్ రెడ్డి అనడాన్నిబట్టి వారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ ఏంటో ఇట్టే అర్థమవుతుందన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బిఆర్‌ఎస్ కు చెందుతుందన్నారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులను రాష్ట్రం నుండి తరిమి వేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. ఇక ఇల్లందు విషయానికొస్తే 15 వేల కుటుంబాలకు, 48 వేల ఎకరాల రోడ్డు పట్టాలను అందించడం జరిగిందని తెలిపారు. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే హరిప్రియ ఈ విషయంలో తనకు విన్నపాలు చేయడం జరిగిందని, ఈ ప్రాంత గిరిజనులు అందరూ ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు దాదాపు 1000 కోట్ల పైగా నిధులతో మారుమూల ఏజెన్సీ గ్రామాలతో పాటు సుందరీకారణ చేయించడంలో హరి ప్రియ చూపిన చొరవను ఇల్లందు ప్రజలు మరువద్దన్నారు.
ఇల్లందుకు ఎన్నికల వరాల జల్లు
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే హరిప్రియ కోరిక మేరకు ఎన్నికల వరాలను ప్రకటించారు. హరిప్రియ తన బిడ్డ లాంటిదని, బిడ్డ కోరిక తీర్చాల్సిన అవసరం తనకు ఉందంటూ.. ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా మార్చటంతో పాటు కొమరారంబోడు పంచాయతీలను ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేస్తామని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు ఎత్తైన మండలాలకు నీటిని అందించేందుకు రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలము సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కోరికలను తీరాలంటే ప్రజలు హరిప్రియను గెలిపించడానికి కారు గుర్తుకు వోటు వేస్తే గెలిచిన అనంతరం మార్చి నెలలోగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్,, సత్యవతి రాథోడ్, ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు మాలోత్ కవిత నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగ కాంతారావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, జడ్పీ చైర్మన్ బిందు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.