- 30 ఆయుధాలు..భారీగా సామాగ్రి స్వాధీనం
- విలేఖరుల సమావేశంలో బస్తర్ ఐజి సుందర్ రాజ్
తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..కాంకేర్ జిల్లాలోని చోటభేతీయ ప్రాంతంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎస్‌కౌంటర్‌లో 14 మంది మహిళలు సహా 29 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. వారి నుండి సుమారు 30 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజి పి. సుందర్ రాజు తెలిపారు. ఇందులో ఏకె 47, ఎస్‌ఎల్‌ఆర్, ఐఎల్‌ఎస్‌ఎస్ మరియు 303 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా మావోయిస్టుల స్థావరాల వద్ద పెద్దమొత్తంలో సాహిత్యం మరియు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లలో దాదాపుగా 71 మంది మావోయిస్టులను పోలీసులు మరియు భద్రతా దళాలు హతమార్చాయని తెలిపారు. వేసవి కాలంలో మావోయిస్టులు చురుకుగా ఉన్నందున ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అటవీ ప్రాంతంలో మవోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
జరిగిన ఎదురుకాల్పులు ముగ్గురు భద్రతా దళ సిబ్బంది గాయపడ్డారని, వారిని మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఆ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని విలేఖరుల సమావేశంలో తెలిపారు. మావోయిస్టులతో తమ పోరాటం నిర్ణయాత్మక మలుపులో ఉందని, ఇందులో తాము అగ్ర భాగాన ఉన్నట్లు తెలిపారు. భద్రతా దళాలు మావోయిస్టులతో పోరాడతాయని బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. ఈ సమావేశంలో కాంకేర్ డిఐజి కెఎల్ దృవ్, బిఎస్‌ఎఫ్ డిఐజి వియం బాల, కాంకేర్ ఎస్పీ ఐకె ఎలిసేబు ఉన్నారు.