- ధరణి అంశంపైనే ఎన్నికలకు పోదాం కేసీఆర్ సిద్ధమా…
- పటేల్, పట్వారి వ్యవస్థ రద్దయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు హరీష్..
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించి వాటి స్థానంలో వివిధ శాఖలో ఖాళీ అయిన 30 వేల ఉద్యోగాలను నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సాధించుకున్నది కొలువులు సృష్టించడానికా.. కొలువుల్లో కోత పెట్టడానిక అని ఎద్దేవా చేశారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో లక్షలాది ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ధరణి అంశంపైనే ఎన్నికల్లో కొట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని.. బిఆర్ఎస్ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు. ధరణి సమస్యలు లేని గ్రామం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాకు ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని, ఫిర్యాదుదారుకు అవకాశం కల్పిస్తామన్నారు.
4 నెలలో ధరణి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రికార్డుల్లో సాగుకాలం తొలగించిన రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదని కేవలం తెలంగాణ మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేల్, పట్వారి వ్యవస్థను తీసుకొస్తారన్న మంత్రి హరీష్ రావు వాక్యాలపై జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 1983-84 లోనే కెసిఆర్ ఎమ్మెల్యే కాకముందే అప్పటి సీఎం రామారావు పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేశారు.. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అని హరీష్ రావు పై ధ్వజమెత్తారు. అనంతరం అల్లిపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, బండ శంకర్, గజేంగి నందయ్య, కొత్త మోహన్, గాజుల రాజేందర్, కల్ల పెళ్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, సర్పంచ్ గంగారెడ్డి, ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.