A place where you need to follow for what happening in world cup

మేం ఓడితే నష్టం ప్రజలకే!

మాకు పోయేదేమీ లేదు.. చెప్పుడు మాత్రం మా బాధ్యత
కాంగ్రెస్ వస్తే తెలంగాణను ఆగం చేస్తరు
వలసల వనపర్తిని.. వరి పండించే వనపర్తిగా మార్చాం
119 నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా కేసీఆర్ లే
నాడు నల్లగొండకు పిల్లనివ్వాలంటే భయపడేటోళ్లు
ఫ్లోరైడ్ ను తరిమికొట్టి జిల్లాను సస్యశ్యామలం చేశాం
అచ్చంపేట, వనపర్తి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. అది ప్రజలకే నష్టం తప్ప మాకు కాదు. ఎవరు త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందో మీకు తెలుసు. కాబట్టి మళ్లీ ఎవరిని గెలిపించాలో కూడా మీరే నిర్ణయించండి. పాలమూరు సర్వతోముఖాభివృద్ధి బీఆర్ఎస్​తోనే సాధ్యమైంది. నల్లగొండ జిల్లాతో సహా రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ ను తరిమికొట్టింది మా ప్రభుత్వమే. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే.’ అని సీఎం కేసీఆర్​అన్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో ఆయన ప్రసంగించారు.

ముద్ర, అచ్చంపేట, వనపర్తి, మునుగోడు : 10 ఏళ్ల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఆగం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ లు ప్రజల ముందుకు వస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. 24 ఏండ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ సాధన కోసం బయలుదేరినప్పుడు రాష్ట్రం తెచ్చే దమ్ము నీకుందా కేసీఆర్..? అని పార్టీలు ఎద్దేవా చేశాయని, ప్రజల ఆశీర్వాదంతో చావు నోట్లో తలకాయ పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించామని అన్నారు.

గుజరాత్​లో కూడా రైతుబంధు లేదు..
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంటు, దళిత బంధులేదని ప్రపంచ దేశంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బందును ఏర్పాటు చేసిన ఘన చరిత్ర కేసీఆర్ ది అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నారని, వారు అధికారంలోకి వస్తే పాత పట్వారి, పటేల్ వ్యవస్థను ముందుకు తెచ్చి ప్రజల భూములకు రక్షణ లేకుండా చేస్తారని అన్నారు. సాగునీటి రంగంలో సమృద్ధిని సాధించడం వల్ల మూడు కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నామని అన్నారు. 24 గంటల కరెంటు నిరాటంకంగా అందిస్తున్న ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీని అన్నారు. సభలో అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్లకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి సభలో..
కాంగ్రెస్ నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేయండి.. అక్కడి నుంచి పోటీ చేయండి అంటూ తనకు సవాల్​విసురుతున్నారని, తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా కేసీఆర్ లేనని, ఆ నాయకులు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్​అన్నారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

నాడు ఈ నేతలంతా ఏమయ్యారు..?
అంబలికి లేక గంజికి లేక పాలమూరు జిల్లాలో ప్రజలు అల్లాడుతుంటే జిల్లాలో మేము తిరిగిన నాడు ఈ నాయకులంతా ఏమయ్యారని ఆయన కేసీఆర్​ప్రశ్నించారు. 2009లో మన పొత్తుతో గెలిచిన నాయకులు ఆరోజు మాట్లాడకుండా ఈరోజు సవాలు విసురుతున్నారని అన్నారు. తెలంగాణ నుంచి నాడు నీళ్లు తరలిస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చున్న నేతలు ఈరోజు సవాళ్లు విసురుతున్నారని అన్నారు. వలసల వనపర్తిని వరి పండించే వనపర్తి గా మార్చామని, మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతి నీటి చుక్క వృథా చేయకుండా వనపర్తి భూమిలో పారించే చేశారని కితాబిచ్చారు.

పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నదెవరు?
పాలమూరు జిల్లాను శశశ్యామలం చేయడం కోసం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నదెవరో అందరికీ తెలుసని, అయినా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని సీఎం అన్నారు. ఏడు దశాబ్దాలుగా రాజ్యమేలిన నేతలు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కూడా తీసుకు రాలేదని, తెలంగాణ ఏర్పడ్డాక పాలమూరు జిల్లాలో ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో తాను వచ్చినప్పుడు పడమర భాగంలో బైపాస్ రోడ్డును పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని, ఈసారి ఉత్తరభాగాన్ని కూడా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వనపర్తి చుట్టూ రింగ్ రోడ్డు పూర్తవుతుందన్నారు.

మునుగోడులో..
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ఇస్తున్నది ఒక్క తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాం..
గతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నం. తెలంగాణ ఏర్పడ్డాక ఫ్లోరైడ్ ను తరిమికొట్టి నల్లగొండను సస్యశ్యామలం చేసుకున్నామని కేసీఆర్​అన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లను గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. మునుగొడు ప్రాంతం రాజకీయ చైతన్యం ప్రాంతం. దొంగలు ఎవరో.. పాలకులెవరో గమనించాలని, మూడోసారి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామని పేర్కొన్నారు.

పైసల కోసం మారేవాళ్లకు బుద్ధి చెప్పాలి..
పైసల కోసం పార్టీలు మారే అహంకారులకు బుద్ధి చెప్పాలని పరోక్షంగా రాజగోపాల్​రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఉప ఎన్నికల్లో చూపించిన చైతన్యాన్ని మరోసారి చూపించాలన్నారు. అనంతరం మంత్రి జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ డబ్బులతో రాజకీయం చేసేవాళ్లను మునుగోడు ప్రజలు నమ్మొద్దని కోరారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు గడ్డపైన సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని అన్నారు.

పిల్లనివ్వాలంటే భయపడేవారు..
గతంలో ఈ ప్రాంత వారికి పిల్లనివ్వాలంటే భయపడే వాళ్లని, చర్లగూడెం ప్రాజెక్టు కడుతుంటే అనేక కేసులు పెట్టారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వాడిగా తనను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించాలని ప్రభాకర్​రెడ్డి కోరారు. 2018 కల్లబొల్లి మాటలు చెప్పి ఒక్క కొబ్బరికాయ తో 100 పనులు అవుతాయని అబద్ధపు మాటలు చెప్పి రాజగోపాల్ రెడ్డి గెలిచారని, గెలిచాక ప్రజలను మోసం చేశారని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీకి రాజ్ గోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని, ఇప్పుడు మరో కాంట్రాక్టు కోసం కాంగ్రెస్ లోకి పోతుండని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.