అధికార పార్టీకి తప్పని సమస్యలు
సంక్షేమ పథకాలే పునాదిగా గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని భావిస్తున్న అధికార పార్టీకి గెలవాలంటే శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది. అంతర్గతంగా అసంతృప్తుల సహాయ నిరాకరణ ఒక పక్క, ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారుల ఆగ్రహం మరో పక్క… వెరసి గెలుపు కోసం పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో ఉన్న మూడు నియోజక వర్గాల్లో కూడా ఎక్కడికక్కడ ఉన్న అంతర్గత సమస్యలు ఇబ్బందులను కలిగించనున్నాయి. నియోజకవర్గంలోని ఖానాపూర్ లో అధికార పార్టీకి పలు కొత్త సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. బిజెపి అభ్యర్థిగా సీనియర్ నాయకుడు రాథోడ్ రమేష్ పోటీ పడడం, అధికార్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ కు టికెట్ రాకపోవటం వల్ల కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో అధికార పార్టీకి తలనెప్పి మొదలైంది. దీనికి తోడు బీ ఆర్ ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ కొత్త అభ్యర్థి కావటంతో పాటు ఎస్టీ కాదన్న ప్రతి పక్షాల ఆరోపణలు సమస్యాత్మకంగా మారనున్నాయి.
ముథోల్ లో…..
ఇక ముథోల్ సెగ్మెంట్ లో అసమ్మతులు ఇప్పటికే రాజీనామా చేయటంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, అనుచరులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరో పక్క నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు భోంస్లే నారాయణరావు పటేల్ రంగంలో ఉండటం, బిజెపి పక్షాన పోటీ పడుతున్న రామారావు పటేల్ సౌమ్యుడు కావటం బీఆర్ఎస్ కు మైనస్ కానుంది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళినపుడు ఎదురైన నిరసనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
నిర్మల్ లో…..
నిర్మల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఈ సారి శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల వీటిని పొందని అర్హులైన లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఇంద్రకరణ్ రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కొంటూ వస్తున్న బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎదురు దాడి చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నారు. దూకుడు తనం ఉన్న నేతలు లేని బిజెపి లో మహేశ్వర్ రెడ్డి చేరికతో ఉత్తేజం నెలకొంది. కాగా మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన నూతన ప్లాన్ వల్ల ఎదురయ్యే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం, దీనికి నిరసనగా చేసిన ఆమరణ దీక్షకు బాధితుల మద్దతు, ప్రజల మద్దతు చేకూరటం అల్లోల ను ఇరుకున పెట్టినట్లు అయింది.
దీనికి తోడు కలెక్టర్ కార్యాలయ నిర్మాణం వ్యవహారం, డీ -1 పట్టాల వ్యవహారం లో మహేశ్వర్ రెడ్డి దూకుడు అధికార పార్టీకి సమస్యగా మారింది. ఇక ఇటీవలి వరకు అధికార పార్టీలో ఉన్న శ్రీహరి రావు తన రాజకీయ భవితవ్యం కోసం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి వరకు సమర్థవంతుడైన నాయకుడు లేకపోవటం వల్ల దిగజారిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. అనతి కాలంలోనే పార్టీ ప్రతిష్టను పెంచగలిగారు. అప్పటి వరకు అధికార పార్టీ, బిజెపి మధ్యనే పోటీ అనే స్థాయి నుంచి త్రిముఖ పోటీ దశకు స్థితిని మార్చారు. తన కేడర్ ను పెంచుకుని అనూహ్యంగా ఎదిగారు. ఈ పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఎదుర్కోవడమే కాకుండా పథకాలు అందని ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవటం అంత సులభం కాదని తెలుస్తోంది.