9మంది మృతి , 10 మందికి గాయాలు.
ఇంఫాల్, మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం అర్ధరాత్రి దాటాక విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 9మంది చనిపోగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర రాజధాని సమీపంలోని తూర్పు ఇంఫాల్, కాంగ్ పోకి జిల్లా సరిహద్దులో ఉన్న ఖామ్ లోక్ గ్రామంలోకి బుధవారం రాత్రి ఒంటిగంట దాటాక అత్యాధునిక ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు వారు చెప్పారు. సోమవారం రాత్రి ఖామ్ లోక్ గ్రామంలో వలంటీర్లకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 9మంది గాయపడిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారం నాడు బిషన్ పూర్ జిల్లాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు కొన్నిప్రాంతాల్లో బంకర్లు ఏర్పాటు చేసుకోవాడానికి చేస్తున్న ప్రయత్నాలను భద్రతాదళాలు అడ్డుకోవడంతో ఈ కాల్పులు జరిగినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలో పోలీసులు కర్ఫ్యూ వేళలను తగ్గించారు. కాగా, మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల మీటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు వందమంది ప్రాణాలు కోల్సోగా, 310 మందికి పైగా గాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో సైన్యాన్ని, పారామిలటరీ దళాలను మోహరించారు. రాష్ట్రంలోని 16 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్ర జనాభాలో మీటీ తెగవారు 53 శాతం ఉండగా, నాగాలు, కుకీలు 37 శాతం ఉన్నారు.