A place where you need to follow for what happening in world cup

నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల
మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌

నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఏటా అంకెల గారడీతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం, మొక్కుబడిగా ప్రసంగం చేయడం షరా మామూలే. గత పదేళ్లలో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వారికి ఏ రకంగానూ బడ్జెట్‌లో ఊరడిరపు కలగలేదు. ఈ క్రమంలో మంగళవారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై దేశ ప్రజల్లో సహజంగానే ఆసక్తి కలుగుతుంది. గత పదేళ్లకు భిన్నంగా బడ్జెట్‌ ఉంటుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ కూడా కలుగుతుంది.

దానికి కారణం గత పదేళ్లుగా బిజెపి ఏ పార్టీ మద్దతు లేకుండా ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉండడంతో సహజంగానే తాము కోరుకున్నట్లుగానే బడ్జెట్‌ను రూపొందించడం జరిగింది. అయితే తొలిసారి మిత్ర పక్షాల మద్ధతుతో సంకీర్ణంలోకి అడుగుపెట్టిన మోదీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌ కావడంతో విపక్షాలతో సహా, అన్ని తరగతుల ప్రజలు కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై సర్వత్రా చర్చ సాగుతుంది.

ఇక దేశ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక సోమవారం ఆమె పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కాగా నిర్మలా సీతారామన్‌ పేరిట వరుసగా ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.