- ఈసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే అది వైసీపీ మద్దతుతోనే సాధ్యమన్న విజయసాయి
- ఏపీ ప్రజల ఆశీర్వాదాలు వైసీపీకే ఉన్నాయని వ్యాఖ్య
- మరోసారి వైసీపీ ఘన విజయం సాధించబోతోందని అన్ని సర్వేలు చెప్పాయని ట్వీట్
దేశ వ్యాప్తంగా అప్పుడే సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. బీజేపీని గద్దె దింపాలనే పట్టుదలతో విపక్షాలు కలసికట్టుగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాల నేతలు సమావేశమవుతున్నారు. మరోవైపు రేపు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలతో బీజేపీ సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
ఈ నేపథ్యంలో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ఢిల్లీలో 30 పార్టీలతో ఎన్డీయే సమావేశం, బెంగళూరులో 24 పార్టీలతో విపక్ష సమావేశం జరగబోతున్నాయని చెప్పారు. అయితే, ఈసారి ఢిల్లీ అధికారానికి మార్గం ఏపీ గుండానే వెళ్తుందని అన్నారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే అది వైసీపీ మద్దతుతోనే సాధ్యమని చెప్పారు. ఏపీలో ప్రజల ఆశీర్వాదాలు కేవలం వైసీపీకి మాత్రమే ఉన్నాయని తెలిపారు. జాతీయ మీడియాతో పాటు, ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలు వైసీపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని చెప్పాయని అన్నారు.