- మహిళపై వ్యక్తిగత విమర్శలు చేస్తావా?
- స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర ఫైర్
జనగామ (రఘునాథపల్లి) : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిపై రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ‘కడియం.. ఇదే నీ సంస్కృతి’ అంటూ ఫైర్ అయ్యారు. కడియం ఓటమి భయంతో తన పై వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారని ఆరోపించారు. తనకు నడుం నొప్పి ఉందని, తాను కూర్చుంటే లేవలేనని తనపై వ్యక్తిగతంగా కామెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
నలుగురు పిల్లల తల్లిగా స్త్రీ ఎంత త్యాగం చేసి ఉంటుందో కడియం గమనించాలని గుర్తుచేశారు. ‘నీ తల్లి ఎంత కడుపు నొప్పి భరిస్తే నీకు ఈ జన్మ వచ్చింది’ అంటూ ఘాటుగా విమర్శించారు. తన ఆరోగ్యం గురించి మాట్లాడే ముందు కడియం ఆయన ఆరోగ్యం చూసుకోవాలని విరుచుకుపడ్డారు. తల్లిపాలు తాగి పెరిగితే కడియంకు ఇలాంటి మాటలు రావని, ఆయనకు కూడా ఆడపిల్లలు ఉన్నారని, ఇంత నీచంగా మాట్లాడడం సిగ్గు చేటు అని ఆమె కడియంపై మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.