మెదక్: హరీశ్ రావును చుస్తే అబద్దాలు ఆత్మహత్య చేసుకుంటాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యులు తీన్మార్ మల్లన్న ద్వజమెత్తారు. గురువారం రాత్రి మెదక్ నవాబుపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దొంతి లక్ష్మీ, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్ దంపతులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మల్లన్న మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు పొద్దున లేచిన నుంచి అన్నీ అబద్దాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.
మెదక్ లో ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు నాగార్జున సాగర్, సింగూర్ ప్రాజెక్ట్ లు కట్టారు. వాటికి ఇప్పటి వరకు కనీసం పగుళ్లు కూడా రాలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజి ఏడాదిలోపే కుంగిపోయిందన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కుక్కతోక తాకినా కూలిపోయేటట్టున్నాయని ఆరోపించారు. కేసీఆర్ మాత్రం తొమ్మిదెకరాల్లో బంగ్లా కట్టుకున్నాడన్నారు.
కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్: మైనంపల్లి హన్మంతరావు
సీఎం కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు రోహిత్ స్మాట్‌గా ఉన్నాడని పొగిడిన నోటితోనే దిష్టిబొమ్మఅని విమర్శించడం ఆయన రెండు నాల్కల దోరణికి నిదర్శనమన్నారు. చిన్న పిల్లోడిని పట్టుకుని దిష్టిబొమ్మ అనడానికి నోరెలా వచ్చిందని కేసీఅర్‌ను ప్రశ్నించారు. సీఎం ఫామ్ హౌజ్‌కు పోయేందుకు ఏడాదికి 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు చేతులొస్తలేవని విమర్శించారు. కేటీఆర్ తెలంగాణాకు ఏమి పడగొట్టారని మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించడం ఖాయం, కేటీఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురెందర్ గౌడ్, జీవన్ రావ్, ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, బొజ్జపవన్, ఉప్పల రాజేష్, సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.