- 99 ఏళ్ల లీజు పేరుతో దోచుకునేందుకు పత్రాలు సిద్ధం
- నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర
- కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సవాల్
- బిజెపి అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్: ఆర్టీసీ భూములను లీజు పేరుతో దోచుకునేందుకు కేసీఆర్ సిద్ధమైండని బిఆర్ఎస్ ను గెలిపిస్తే ఆర్టీసీ ఆస్తులు ఖతం చేస్తాడని కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలన్నీ 99 ఏళ్ల లీజు పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద పత్రాలను సిద్ధం చేశారని వెల్లడించారు. పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పరం కాబోతున్నయని అందుకోసం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మీ ఓటు పవర్ చూపండి కేసీఆర్ ను ఓడించి ఆర్టీసీని కాపాడండి అంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీసహా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీకి అండగా నిలవాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న తనలాంటి వాళ్లకు అండగా నిలవకపోతే కేసీఆర్, గంగుల కమలాకర్ వంటి అవినీతి, అక్రమార్కులను నిలువరించే వాళ్లెవరూ రాజకీయాల్లో ఉండబోరని హెచ్చరించారు.
ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్దుంపూర్ లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి పూలు చల్లి, తిలకం దిద్ది సంజయ్ కు స్వాగతం పలికారు. వారితో కలిసి ముగ్దూంపూర్ లో రోడ్ షో చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం తామే చేస్తున్నట్లుగా కొబ్బరికాయలు కొడుతూ ఫోజులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. రైతుల వద్ద నుండి వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తోంది. రోడ్లు, వీధి దీపాలు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి అయ్యే నిధులన్నీ నేనే తెచ్చిన. స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన. గంగుల కమలాకర్ మాత్రం కొబ్బరికాయ కొట్టి తానే ఆ నిధులు తీసుకొచ్చినట్లు ఫోజులు కొడుతున్నడు. ప్రజలేమైనా ఎడ్డోళ్లు అనుకున్నవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంగుల కమలాకర్ కు ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలి. నేను ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడితే కేసు పెట్టుకోవచ్చు అన్నారు. ప్రజల సమస్యలపై నేను పోరాడుతుంటే నాపై 74 కేసులు పెట్టారు. నన్ను అక్రమంగా రెండుసార్లు జైలుకు పంపారు. లాఠీఛార్జ్ చేశారు. నా ఆఫీస్ ను ధ్వంసం చేశారు అయినా నేను భయపడలే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడమే తన ధ్యేయంగా చెప్పుకొచ్చారు. ఆయన వెంట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకురాలు గండ్ర నళిని తో పాటు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.