మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగా సర్దుకు పోదామనుకున్నా బీఆర్ ఎస్ లో ఇమడ లేని పరిస్థితి ఏర్పడింది. పాలేరు టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్ తాజా జాబితాలో మొండి చేయి చూపారు. దీంతో ఆయన ఇక బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసలు గత కొంత కాలంగా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉక్కపోతకు గురౌతున్నారు.గతంలో ఒక సారి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు తుమ్మల తన అభిమానులతో ములుగులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 350 కార్లలో వాజేడు చేరుకున్నారు. అంతకు ముందు భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాటి ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత ఆయన పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే ఆయన బీఆర్ఎస్ వీడలేదని అప్పట్లో గట్టిగా వినిపించింది. 2018 ఎన్నికలలో తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిగా పరాజయం పాలైన తరువాత ఆయన పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఎవరు ఔనన్నాకాదన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల బలమైన నేత. ఆ విషయంలో బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ కు కూడా స్పష్టత ఉంది.అందుకే ఎప్పటికప్పుడు ఆయనను బుజ్జగిస్తూ, హామీలు ఇస్తూ బీఆర్ఎస్ ను వీడకుండా చూసుకుంటూ వచ్చారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే సమయంలో కేసీఆర్ కనీసం తనను సంప్రదించకపోవడం, ఏక పక్షంగా పాలేను అభ్యర్థిని ప్రకటించడంతో తుమ్మల ఇక బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అయితే ఆయన బీ ఆర్ఎస్ ను వీడితే ఆయన అడుగులు ఎటుపడతాయన్న దానిపై ఖమ్మం రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తుమ్మలకు అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పలుకుబడి కూడా ఉంది.
ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన తుమ్మల రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం గూటికి వెళతారా అన్నచర్చ జరుగుతోంది. మరో వైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్న నేపథ్యంలో ఉన్న బలానికి తోడు తుమ్మల వస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నదని అంటున్నారు. ఇలా ఉండగా గత రెండు మూడు రోజులుగా తుమ్మలతో బీజేపీ నేతలకు టచ్ లోకి వచ్చారని రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక తెరాసలో తుమ్మల ప్రస్థానాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే.. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి ఇచ్చారు.
అయితే 2018 ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల అప్పట్లో ఖండించారు. దీంతో ఆయన కాంగ్రరెస్ గూటికి చేరుతారన్న వదంతులు బలంగా వినిపించాయి. అయితే తుమ్మల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు.ఇప్పుడు ఇక బీజేపీ తన అవసరాల కోసం తుమ్మలను ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం తుమ్మలతో టచ్ లోకి వచ్చి పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు జరిపిందని అంటున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లేననీ, తుమ్మల కూడా బీజేపీ గూటికి చేరడానికి సుముఖత వ్యక్తం చేశారనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి కమలం టికెట్ షరతు విధించారని పరిశీలకులు అంటున్నారు. అందుకు బీజేపీ కూడా అంగీకరించిందని రాజకీయవర్గాలలో ఓ టాక్ నడుస్తోంది.