తెలంగాణ బీజేపీలో కీలక నేతలందరూ అసెంబ్లీ బరిలో దిగితే ఫలితాలు బాగుంటాయని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న ఐదుగురు బీజేపీ ఎంపీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. ముందుగా అసెంబ్లీకి పోటీ చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని పార్టీ హైకమాండ్ లెక్కలు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ తరహా ప్లాన్ అవలంభించాలని లెక్కలు వేస్తోంది. అక్కడ పార్లమెంట్ సభ్యులను.. అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపి మంచి ఫలితాలను రాబట్టారు. అదే వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఢిల్లీలో అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో ఎంపీలు, జాతీయ నాయకులు అందరూ పోటీ చేయాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా సమాచారం.. అయితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్.. తిరిగి కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లేదా వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ సభ్యులు.. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ తమకు చెప్పలేదంటున్నారు బండి సంజయ్. అదే విధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని తేల్చి చెబుతున్నారు.ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. బోధ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ ఎంపీలంతా తమ మనుసులో మాట అధిష్టానానికి చెప్పేశారట. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.మరోవైపు ఇతర పార్టీలు టికెట్స్ వ్యవహారంలో ముందుంటే బీజేపీ వెనుకబడి పోయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎంపీలు, జాతీయ నాయకులతో కలిపి 30మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అధిష్టానం భావిస్తుంటే.. ఇక్కడ ఉన్న నాయకులు ఢిల్లీకి వెళ్లి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. ఇలా బీజేపీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందని టాక్.. అయితే, అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ అధిష్టానం కూడా డ్రాఫ్ట్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.