సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల లీడర్ల్ అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు ఇప్పటి నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం పేరు కొంత మందికే తెలుసు.. కానీ అక్కడ జరిగిన ఉపఎన్నిక తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షించింది దుబ్బాక నియోజకవర్గం.. అందుకే ఈ నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి ప్రధాన పార్టీలు అన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి.అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి మూడు ప్రధానమైన పార్టీలు.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఇప్పటి నుండే తమ వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయం రసవతరంగా మారి త్రిముఖ పోటీ నడుస్తుండడంతో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో అధికారం కోసం పావులు కలుపుతున్నారు.ఇక బిఆర్ఎస్ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయం వాడివేడిగా కొనసాగుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గత కొన్ని నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ చిన్న చితక సమస్యలను తీరుస్తూ, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నారు.
అంతేకాకుండా పక్క పార్టీల నుండి తమ పార్టీలోకి యువతను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే కావాలన్న తన కలను ఈ ఎన్నికల్లో తీర్చుకోవడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారని రాజకీయ వర్గాల చర్చ. మొన్నటికి మొన్న యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్‌ను అందించారు ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి. ఖచ్చితంగా ఈ సారి దుబ్బాక ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకునేందుకు కార్యకర్తలతో ఎన్నికల సమయంలో ఎలా ముందు కెళ్లాలనే విషయాలను చర్చించుకుంటూ ఎప్పటి కప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.