అసెంబ్లీ ఎన్నికల టికెట్ల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటుంది. కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌తో టికెట్ ఆశావాహులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సిట్టింగ్‌లకే కేసీఆర్ మెజార్టీ టికెట్లు కేటాయించడంతో నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు గోడ దూకేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఆశించాడు. మెదక్ సెగ్మెంట్ నుండి కొడుకుని బరిలోకి దించాలనుకున్నాడు. అయితే, మెదక్ సీటును మరోసారి సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీష్ రావే అడ్డుకున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మెదక్‌లో హరీష్ రావుకు ఏం పని అని.. హరీష్ రావుకు తన తడాఖా ఏంటో చూపిస్తానని తిరుమల వెంకటేశ్వరుడి సాక్షిగా మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్లో అగ్రనేత, మంత్రి అయిన హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా మంత్రి హరీష్ రావుపైనే సొంత పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మైనంపల్లిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేసి దాదాపు వారం గడిచిన బీఆర్ఎస్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లి పార్టీ మారితే జరిగే డ్యామేజ్ అంచనా వేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్‌గా ఉందని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మైనంపల్లిని బుజ్జగించేందుకు సైతం ఓ బీఆర్ఎస్ కీలక నేత రంగంలోకి దిగినప్పటికీ.. మైనంపల్లి పట్టువీడనట్లు టాక్.
దీంతో మైనంపల్లిపై సస్పెన్షన్ వేటుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికే మల్కాజిగిరి సెగ్మెంట్‌కు మైనంపల్లికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ మైనంపల్లిపై వేటు వేస్తే ఆయన దీటుగా మరో అభ్యర్థిని మల్కాజిగిరిలో నిలబెట్టుందుకు సైతం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటు వేస్తే మల్కాజిగిరిలో మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బీఆర్ఎస్పై తిరుగుబాటు చేసి వెళ్లిన మైనంపల్లిని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్.. మంత్రి కేటీఆర్ అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మైనంపల్లిపై పోటీకి నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓ పక్కా ఈ ప్రచారం బలంగా జరుగుతుండగానే.. ఎమ్మె్ల్సీ శంభీపూర్ రాజు సోమవారం మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుందిటికెట్ అంశంపై చర్చించేందుకే హరీష్ రావుతో శంభీపూర్ భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ మైనంపల్లిపై వేటు పడితే.. మల్కాజిగిరి నుండి శంభీపూర్ రాజు బరిలోకి దిగే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పొలిటికల్ కారిడార్‌లో చర్చ జరుగుతోంది. ఇక, మల్కాజిగిరికి కొత్త అభ్యర్థి ప్రకటనతో పాటు మిగిలిన మరో నాలుగు సీట్లును సైతం బీఆర్ఎస్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. జనగాం సీటు ఎమ్మెల్సీ పల్లా, నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి ఆనంద్ గౌడ్, గోషామహాల్ నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారు చేశారని.. మరో రెండు మూడు రోజుల్లో ఈ పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ప్రకటనతో మళ్లీ ఆశలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఒకేసారి 115 మందికి టికెట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచారు గులాబీ బాస్. అయితే కేసీఆర్ చల్లనిచూపుతో సీట్లు దక్కించుకున్న అభ్యర్ధులకు ఆ ఆనందం నిలిచే అవకాశం కనిపించడం లేదు. సీట్లు ప్రకటించిన రోజు.. వారి పెదవులపై కనిపించిన చిరునవ్వు స్థానంలో.. ఇప్పుడు వారి ముఖాలు ఆందోళనతో కనిపిస్తున్నాయి. కారణం.. ఈ జాబితాలో కొన్ని మార్పుచేర్పులుంటాయని చివరలో కేసీఆర్ చెప్పడమే. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కేసీఆర్ వాళ్లందరికీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వడంతో వాళ్లకు బీ ఫారం ఇస్తారా? లేదా? అన్న అనుమానాలకు తెరలేచింది. దీంతో సీట్లు దక్కించుకున్న వారిలో టెన్షన్ మొదలయింది. వాటిలో కొన్ని మార్పు చేర్పులుంటాయని కేసీఆర్ చెప్పకుంటే.. సీట్లు ఖాయమైన అభ్యర్ధులకు ఎలాంటి ఆందోళన ఉండేది కాదు.
మరోవైపు సీటు దక్కించుకోలేకపోయిన తాడికొండ రాజయ్య.. బేతి సుభాష్‌లు సీటుపై ఇంకా ఆశలు పెట్టుకోవడం చూస్తుంటే.. మార్పులు అనివార్యమన్న సంకేతాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించినప్పటికీ సీటుపై ఆశలు కోల్పోవడం లేదు కొంతమంది. దీంతో మార్పులు అనివార్యమన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో టిక్కెట్ ఖాయమైన గులాబీ నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు. కొందరైతే తమకే అవకాశం ఇవ్వాలని బలప్రదర్శనకు దిగుతున్నారు. మరి గులాబీ బాస్ మనసు మారుతుందా.. లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో పెట్టారు. తమకే టిక్కెట్ కేటాయించాలని ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారు. మరికొందరు మాత్రం జాబితాలో మార్పులు ఉంటాయని కార్యకర్తలకు చెప్తున్నారు.ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ రాకపోవడం మాదిగల అస్థిత్వానికే ప్రమాదమంటున్నారు ఆ వర్గానికి చెందిన నాయకులు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉన్న జనాభాలో 95 శాతం మాదిగలే ఉన్నారని.. రాజయ్యకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. టిక్కెట్ రాకపోతే ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు ఎమ్మెల్యే రాజయ్య.
నర్సాపూర్ టిక్కెట్‌పై సస్పెన్స్..
నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సునీతా లక్ష్మారెడ్డికి అవసరం అయితే ఎమ్మెల్సీతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటున్నారు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి. కార్యకర్తల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా.. టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా అని ప్రశ్నించారు. వారం పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.అయితే, జాబితాలో గులాబీ బాస్ ఎలాంటి మార్పులు చేయకపోతే.. టిక్కెట్ రాని నేతల వ్యూహం ఎలా ఉంటుందోనన్న చర్చ కొనసాగుతోంది.