బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి హ్యాండ్ ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజయ్య రాజకీయ భవిష్యత్ గందరగోళంలోకి నెట్టినట్లు అయింది. అయితే ఆ తర్వాత రాజయ్య వేస్తున్న అడుగులు, చేస్తున్న కామెంట్స్ కూడా… చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య భేటీ కావటం సంచలన పరిణామంగా మారింది.
వరంగల్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ అయ్యారు. హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిశారు. ప్రస్తుతం వీరి సమావేశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజయ్య కాంగ్రెస్ చేరడం లాంఛనమేనని అనే చర్చ జోరందుకుంది. ఈ పరిణామంతో రాజయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారిందిటికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్న రాజయ్య.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనే చర్చ వినిపిస్తూ వస్తోంది. కాంగ్రెస్ లేదా బీఎస్పీలో చేరుతారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన…. దామోదరను కలవటంతో కాంగ్రెస్ లో చేరే దిశగా ఆలోచన చేస్తున్నారా..? అన్న చర్చ తెరపైకి వస్తోంది. అయితే ఈ వార్తలపై రాజయ్య నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. వీరి భేటీపై ఆయన ఏం చెబుతారనేది చూడాలి.