కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యాలయంలో పోస్టర్లు వెలిశాయి. గాంధీభవన్ గోడలపై అతికించిన ఈ పోస్టర్లు ఇప్పడు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మధు యాస్కీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మధుయాష్కీకి టికెట్ ఇవ్వొద్దంటూ పోస్టర్లు అతికించడం చర్చనీయాంశంగా మారింది. మధుయాష్కీని ఉద్దేశిస్తూ ‘గో బ్యాక్ టు నిజామాబాద్.. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దు’ అంటూ పోస్టర్లపై పేర్కొన్నారు.సేవ్ ఎల్బీ నగర్ అంటూ పోస్టర్లు వేయడంతో కలకలం రేగింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో ఎల్బీ నగర్ సీటు కోసం మధుయాస్కీ దరఖాస్తు చేసుకున్నారు.
ఎల్బీనగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా మధుయాస్కీ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్ నియోజక వర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో గెలుపు సులువు అవుతుందనే ఉద్దేంతో మధుయాస్కీ గౌడ్ ఉన్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఎల్‌బి నగర్‌లో 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓడిపోయారు. గెలిచిన కొద్దిరోజులకే సుధీర్ రెడ్డి కూడా కారెక్కారు.సుధీర్ రెడ్డి పార్టీ మార్పు తర్వాత… ఇక్కడ మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. స్థానిక నేతగా పేరున్న స్థానిక నేతగా పేరున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా పని చేస్తున్నారు.
పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ తమదే అన్న ధీమాలో ఇద్దరు నేతలు ఉన్నారు. అనూహ్యంగా పార్టీకి చెందిన సీనియర్ నేత మధుయాస్కీ గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో పోటీ నెలకొంది.మధుయాస్కీ గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిజామాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసే విషయంలో డైలామాలో పడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే…. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ టికెట్ బరిలోకి మధుయాష్కీ రావడంతో ఆయన ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే గాంధీ భవన్‌లో పోస్టర్లు వెలిసినట్లు చెబుతున్నారు.