A place where you need to follow for what happening in world cup

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • పేద దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదిక లాంటిదన్న మోదీ
  • ఇండియా లేకుంటే యూఎన్‌ఎస్‌సీ పరిపూర్ణం కాదని వ్యాఖ్య
  • ఫ్రాన్స్‌కు వెళ్లేముందు ఫ్రెంచ్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదిక లాంటిదని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ లేకుండా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) పరిపూర్ణం కాదని చెప్పారు.
ఫ్రాన్స్‌కు బయల్దేరే ముందు ఫ్రెంచ్‌ డెయిలీ ‘లెస్‌ ఎకోస్‌’తో గురువారం ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు? ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి? అన్నదానిపై భారత్‌ సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయి” అని ఆయన తెలిపారు.
యోగా అనేది ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైందని ప్రధాని అన్నారు. ‘‘మా సంప్రదాయ ఔషధమైన ఆయుర్వేదాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తోంది. మా నిపుణులు ఎన్నడూ యుద్ధం, అణచివేత వంటి వాటికి పాల్పడలేదు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, శాస్త్రం, గణితం వంటి ప్రజా ఉపయోగకర అంశాలపైనే దృష్టి సారించారు” అని చెప్పారు.
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపైనా ప్రధాని స్పందించారు. ఉద్రిక్తతలకు ముగింపు పలకడం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పుతిన్‌, జెలెన్‌స్కీకి చాలా సార్లు చెప్పినట్లు వెల్లడించారు. ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి చెప్పారు. దౌత్యపరమైన చర్యలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలను కోరుతున్నామని మోదీ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.