A place where you need to follow for what happening in world cup

ప్రజాదర్బార్ అనవసరమా ?

0 127

  • రాష్ట్రం లో సమస్యలే లేవా ? 
  • కెటిఆర్ వ్యాఖ్యలపై దుమారం.

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాదర్బార్ అవసరమే లేదని, అలా దర్బార్ నిర్వహిస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్టేనని పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ ఇటీవల సూత్రీకరించారు. ఈ వాదన పట్ల మేధావులు, ప్రజాస్వామిక వాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణిని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారులను, మంత్రులను, ముఖ్యమంత్రులను కలసే అవకాశం ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఉండేది. గతంలో ఆయా సంఘాల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను పై స్థాయికి తీసుకువెళ్లి పరిష్కరించేవారు. తెలంగాణ ఏర్పడినంక ఆ ఊసే లేకుండాపోయింది. సామాన్యుల సంగతి అటుంచితే, సచివులకు, సైతం ముఖ్యమంత్రి దర్శనభాగ్యం లభించడం లేదు. ఎమ్యెల్యేలకు, చోటామోటా లీడర్లకు ఆయన అపాయింట్ మెంట్ కల్ల. ఇది ప్రజాస్వామ్యమేనా, దొరల రాజ్యం, గడీల పాలన అని కడుపుమండిన ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటే వాటిని అధికార పార్టీవారు తేలికగా కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలో అసలు ప్రజాదర్బార్ అవసరమేలేదని యువరాజా వారు దబాయిస్తున్నారు. ఈ ఎదురుదాడి ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ 9 ఏళ్లలో తెలంగాణ బంగారు తునకగా మారిపోయిందని, అసలు సమస్యలే లేకుండా జనం నిశ్చింతగా గడుపుతున్నారని ఏలుతున్నవారు (బిఆర్ఎస్ నేతలు) బలంగా విశ్వసిస్తున్నారన్నమాట.తాము ప్రవేశపెట్టిన పథకాలపై విపరీతమైన నమ్మకం ఓవైపు, వందిమాగధుల జేజేలు మరోవైపు వినిపిస్తుంటే ఏ పాలకుడికైనా ఇదేవిధమైన భ్రమ కలుగుతుంది. అందుకే ప్రజాదర్బార్ అనవసరమనే భావన ప్రబలుతుంది. 

  ఉమ్మడి రాష్ట్రంలో , ఆ మాటకొస్తే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రజలతో మమేకం కావడానికే , వీలయినంత వరకు ప్రజలకు దగ్గరగా మెలగడానికే పాలకులు మొగ్గు చూపుతారు. మన ఒక్క తెలంగాణలో అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండరు. తాము ఎవరిని కలవాలనుకుంటే వారికే రాజసౌధంలో ప్రవేశం దొరుకుతుంది. ఇతరులకు నో ఎంట్రీ. ప్రజల కోసం నిర్మితమైన ప్రగతిభవన్ లో సెలెక్టెడ్ పర్సన్ లతో, సెలెక్టెడ్ ఇష్యూలపై, సెలెక్టెడ్ రోజుల్లో మంతనాలు, ఫార్మర్స్ హౌస్ లో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు మాత్రమే జరుగుతాయి. అందుకే ప్రజాదర్బార్ నిర్వహించాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పలువురు మేధావులు, ప్రతిపక్ష నేతలు సూచిస్తే అదేదో అపరాధం అయినట్టు, తమ ప్రతిష్ఠకు తీరని భంగం వాటిల్లుతున్నట్టు యువరాజా వారు తెగబాధపడిపోయారు. అసలు తెలంగాణలో సమస్యలే లేనట్టు, ఉన్నా అవేవీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాదన్నట్టు తేల్చేశారు. ప్రజాదర్బార్ పెట్టడమంటే వ్యవస్థలో లోపం ఉన్నట్టేనని తీర్మానించారు. అంతేకాక చిన్నచిన్న సమస్యల కోసం సిఎం దాకా రావాల్సిన అవసరం, అగత్యం ఏంటని నిలదీశారు.

మరి అదే సి ఎం అనేక రాష్ట్రాల వారిని తరచుగా కలుస్తూనే ఉన్నారు. అలాగే ఎవరి స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు, సలహాదారులు తమకు కావలసినవారితో నిరంతరం మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఒక్క ప్రజలకు మాత్రం ప్రవేశం లేదు. నిజానికి రాష్ట్రంలో సమస్యలు నిజంగానే లేవా అంటే బోలెడున్నాయి. కెసిఆర్ భాషలో చెప్పాలంటే, రాస్తే రామాయణమంత, చెబితే భారతమంత. కుమ్రం భీం జిల్లా నుండి జోగులాంబ జిల్లాదాకా, భద్రాచలం నుండి బాసర దాకా జనం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీటిని కిందిస్థాయి అధికార యంత్రాంగం పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది ఉద్యోగులున్నారని ఎవరి స్థాయిలో వారు సమర్థంగా పనిచేస్తే సమస్యలనేవీ ఉండవనేది చిన్నదొరవారి అంచనా . ఇది వందశాతం నిజమే. కాని అలా చేయనప్పుడు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. వారికంటే పై స్థాయి అధికారులకో, ప్రజా ప్రతినిధులకో చెప్పాలి. ఇక అక్కడా లాభం లేకపోతే, ఆశించిన న్యాయం జరగకపోతే ఎవరిని ఆశ్రయించాలి . అందుకే సిఎం లాంటి పెద్దాయనను కలవాలనుకుంటారు. కనీసం ఆయన జోక్యం చేసుకుంటే నైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తారు. ఈ లాజిక్ నే కెటిఆర్ గారు మరిచిపోయారు. వ్యవస్థలో లోపం ఉంటే దానిని ఎలా సరిదిద్దుతారు. అసలు వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అనేది తెలిసేది ఎలా. ప్రజలతో కలిస్తేనే కదా. అయినా ఆవు పొలంలో మేస్తుంటే, దూడ గట్టున మేయదనే సంగతి కెటిఆర్ విస్మరించారు. పెద్దవాళ్లు ప్రగతిభవన్ కో, ఫార్మర్స్ హౌస్ కో పరిమితమైతే కిందిస్థాయి అధికార గణం తమ కార్యాలయాలకు, విధులకు మాత్రమే పరిమితమవుతారని, జనం కడగండ్ల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తారని ఎలా అనుకుంటారు. నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఎట్లా ఆశిస్తారు. అయినా ప్రజల భ్రమ కాని వారి చేతుల్లో సర్వాధికారాలున్నాయా. తెలంగాణలో ఎవరికీ అధికారాలు లేవు.సొంత నిర్ణయాలు తీసుకోగల సత్తా లేదు.

స్కాలర్ షిప్స్ జాడేది?…అధ్యాపకులకు జీతాలేవి ?

విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నాయి. విద్యాసంస్థలు తెరిచారు. పాఠ్యపుస్తకాలు ఇంకా సరఫరా కాలేదు. రేషన్ కార్డుల దరఖాస్తులు, పెన్షన్ దరఖాస్తులు ఆఫీసుల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ప్రభుత్వోద్యోగులకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు నాలుగువేలమంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసి 45 రోజులు గడిచినా తొలివేతనమే రాలేదు. అలాగే, జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1654 మంది గెస్ట్ లెక్చరర్లకు గత ఏడాది నవంబర్ నుండి జీతాలు లేవు. అనేక మార్లు దరఖాస్తులు చేయగా, విన్నపాలు వినిపించగా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ పలు మార్లు లేఖలు రాయగా ఆర్థిక శాఖ ఇటీవల ఆరునెలల జీతం విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరమివ్వడన్నట్టు ఇంటర్ బోర్డు కమీషనర్ నవీన్ మిట్టల్ మాత్రం మూడు నెలల జీతం మాత్రమే అందజేయండని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించాడు. డిగ్రీ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్త పి ఆర్ సి ప్రకారం 30 శాతం వేతనాలు ప్రభుత్వోద్యోగులందరికీ అందినా 1654మంది గెస్ట్ లెక్చరర్లకు అందలేదు. అదేమంటే జీవో కాపీ కాస్త ఆలస్యంగా వచ్చిందట. ఒక్కొక్కరు రూ.50వేలు నష్టపోయారు. అందరికీ ఇచ్చి చిరుద్యోగులైన అతిథి అధ్యాపకులకు మొండిచేయి చూపారు. మరి ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి. కెటిఆర్ గారి పద్ధతి ప్రకారం ఆయా లెక్చరర్లు తమ పై అధికారులైన కళాశాల ప్రిన్సిపాళ్ళను అడిగారు. వారి పైన ఉండే డిఐఇఓలను, ఆర్ జె డిలను అడిగారు. ఇంటర్ బోర్డు కమీషనర్ నూ అడిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. రెండేళ్లయింది. ఆ 30 శాతం పెరిగిన వేతనం మాత్రం ఆ ఏడాదికి రాలేదు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులను,అగచాట్లను రాష్ట్రంలో సబ్బండ వర్ణాల వారు పడుతున్నారు. అయినా ప్రజాదర్బార్ ఎందుకు అని మన మంత్రిగారు ప్రశ్నిస్తున్నారు.

రాచరిక వ్యవస్థలో మారువేషాల్లో సంచారం.. 

రాచరిక వ్యవస్థలో మహారాజ దర్శనం కోసం కోట ప్రధాన ద్వారం వద్ద అభ్యాగతులు పడిగాపులు పడేవారు. కిందిస్థాయి భటులు, సేనానులు వారిని రాజు దగ్గరకు పంపేవారు కాదు. ఉత్తముడైన ఏ మంత్రో, దండనాయకుడో జాలిపడి రాజు గారి చెవిన వేస్తేనో, వారు సిఫారసు చేస్తేనో రాజసభలోకి ప్రవేశం లభించేది. బాధితులు సమస్యలు చెప్పుకునేవారు. రాజుగారి మూడ్ బాగుంటే వారి పంట పండేది. ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు. సిఫారసు చేసేవారు, చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దర్శనం ఇప్పించేవారే కరువయ్యారు. ఇక సమస్యల సరేసరి. రాజుల కాలంలో దర్శనం మాత్రమే అప్పుడప్పుడు దుర్లభం. కాని ఒక్కసారి లోపలికి పంపించాక కిందిస్థాయి ఉద్యోగులను కాని, భటులను కాని రాజు గారు ఏమనేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. గేట్ దగ్గరకే ఎవరినీ రానివ్వడం లేదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించేవారే ఎక్కువయి పోయారు. నిజానికి రాజుల కాలంలో రాజులు, మంత్రులు మారువేషాల్లో రాజ్యంలో సంచరించి వాస్తవాలు తెలుసుకునేవారు. ప్రస్తుతం అంత సాహసం అవసరం లేదు. కనీసం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారానైనా ఏం జరుగుతున్నదో తెలుసుకుంటే చాలు. ఆ విభాగాన్ని పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల కార్యకలాపాలపై నిఘాకే వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజల దగ్గరకు వెళ్లకున్నా ఫరవా లేదు. వాళ్లు వచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చినా చాలు. కాని, యధారాజా తథా ప్రజా అన్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రధాన ఏలిక ఎలా ఉంటే మిగతావారూ అలాగే ఉంటున్నారనే నిజాన్ని కెటిఆర్ గారు గ్రహిస్తే మేలు.

 

గతంలో ఎందరో ముఖ్యమంత్రులు ప్రజాదర్బార్ నిర్వహించేవారు. అనేక సంఘాల వారు అపాయింట్ మెంట్ తీసుకుని మరీ తమ ఇక్కట్లను చెప్పుకునేవారు. స్వపక్ష, విపక్ష ఎమ్మెల్యేలెందరో నేరుగా మంత్రులను, ముఖ్యమంత్రిని కలసేవారు. అంతేకాక, అనేకానేక సమస్యలపైనా, విషయాలపైనా, విధివిధానాలపైనా అఖిలపక్ష సమావేశాలు జరిగేవి. ఇప్పుడు మచ్చుకు కూడా అలాంటివి కానరావడం లేదు. పౌరహక్కుల సంఘాల వారు. మేధావులు ముఖ్యమంత్రితో మాట్లాడేవారు. ఇప్పుడేవీ అలాంటి పరిస్థితులు. అదేమంటే సమస్యలుంటే కదా, చర్చించేది, కలవనిచ్చేది అని పాలకులు అంటారు కావచ్చు.ఒకరిద్దరు మంత్రులు తమ ఇళ్లవద్ద, కార్యాలయాల వద్ద పలువురిని కలుస్తున్నారు. వారిని అడిగితే తెలుస్తుంది. ప్రజలకు సమస్యలు ఉన్నాయా , లేదా అనే సంగతి. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ చూడలేదనుకున్నట్టుగా సమస్యలే లేవంటే చేసేదేముంది. కెటిఆర్ గారు చెప్పినట్టు ప్రతి నిర్ణయం పారదర్శకం, ప్రతిమలుపులో జవాబుదారీ తనం, ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా?.మొండివాడు రాజుకంటే బలవంతుడు అని మనకు సామెత. మరి మొండివాడే రాజైతే …?

నందోరాజా భవిష్యతి….

Leave A Reply

Your email address will not be published.