A place where you need to follow for what happening in world cup

కామ్రెడ్ లతో పొత్తు పొడిచేనా..?

  • కేసీఆర్ మౌనంతో కమ్యూనిస్టుల అసహనం
  • సీట్ల వ్యవహారం తేల్చాలంటూ విన్నపాలు
  • బల ప్రదర్శనలతో పరోక్ష సంకేతాలు
  • గులాబీ పార్టీలో స్థానిక నేతల విముఖత

రేలన్యూస్, హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే చర్చ సర్వత్రా జరుగుతున్నది. దేశంలో మతతత్వ బీజేపీని గద్దె దింపడానికి లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో అవగాహన కుదుర్చుకోవాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో కామ్రెడ్ల మద్దతుతో బీజీపీని ఓడించారు. 

మరో ఆరు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మకం కావడంతో బీజీపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి మళ్ళీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులతో పొత్తు కీలకమని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కమ్యూనిస్టు నేతలకు ఏమి హామీ ఇచ్చారో ఇరు వర్గాలు వెల్లడించలేదు. సీట్ల ప్రస్తావన రాలేదని కొందరు కమ్యూనిస్టు నేతలు తెలిపారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ఎన్నికల పొత్తుల వ్యవహారాన్ని ఇప్పటి వరకూ తేల్చక పోవడం పట్ల కమ్యూనిస్టులు కొంత అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రాష్టంలోని 30 కి పైగా నియోజకవర్గాల్లో

కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నందున ఓట్లు చీలకుండా ఉండాలంటే వారితో పొత్తు పెట్టుకోవలని కొందరు బీఆర్ఎస్ నేతలు భావిస్తుండగా ఒంటరిగా బరిలోకి దిగినా తాము విజయం సాధిస్తామని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఐదారు సీట్లు ఇచ్చినా తమకు నష్టమేమీ లేదని కేసీఆర్ కూడా సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. పొత్తుల విషయంలో కేసీఆర్ ఏమీ తేల్చక పోతే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి పోటీచేయాలని కూడా ఆ పార్టీల నేతలు సూత్ర ప్రాయంగా అంగీకరించారు. ఈ మేరకు రెండు పార్టీల నేతలు ఇటీవల సమావేశమై చర్చించారు. పొత్తుల విషయంలో ఏదో ఒకటి తేల్చమని సీపీఐ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేయగా సీపీఎం నేతలు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సమావేశాలు, ర్యాలీలతో బల ప్రదర్శన చేయడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

జిల్లాల్లో గందరగోళం..

పొత్తుల వ్యవహారం ఎటూ తేలక పోవడంతో కమ్యూనిస్టులు సీట్లు ఆసిస్తున్న జిల్లాల్లో కొంత గందరగోళం నెలకొని ఉన్నది. బీఆర్ఎస్ కు బలం లేని ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని కొన్నిసీట్లు కేటాయించే ప్రతిపాదన సీఎం ముందు ఉన్నది. అయితే స్థానికి బీఆర్ఎస్ నేతలు మాత్రం పొత్తులకు సుముఖంగా లేరు. ఒంటరిగా బరిలోకి దిగినా విజయం

సాధిస్తామనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించినా ఓట్ల బదలాయింపు జరగదనేది వారి వాదన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు ఈ విషయాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఆరు సీట్లపై కామ్రెడ్ల గురి…

పొత్తుల కోసం చర్చలు జరిగితే కనీసం 10 సీట్లు తగ్గకుండా డిమాండ్ చేయాలని కమ్యూనిస్టులు భావిస్తున్నప్పటికీ చెరో మూడు సీట్లకు సరి పెట్టుకునే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాలేరు, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడెం స్థానాలను సీపీఎం కోరుతుండగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ సీట్లను కేటాయించాలని సీపీఐ అడుగుతున్నది. హుస్నాబాద్ సీటును కూడా సీపీఐ ఆశిస్తున్నప్పటికీ అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే సతీష్ ను మార్చడానికి సీఎం అంగీకరించడం లేదు. సతీష్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు కావడమే దీనికి కారణం.

హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న సీపీఐ నేత చాడా వెంకటరెడ్డికి అవసరమైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీపీఎం కోరుతున్న భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా పాలేరు, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ కోరుతున్న పినపాక, కొత్తగూడెం, దేవరకొ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. దేవరకొండ ఎమ్మెల్యే సీపీఐ నుంచి విజయం సాధించి బీఆర్ఎస్ లో చేరడం విశేషం. పొత్తుల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర దింపాలంటే కేసీఆర్ మౌనం వీడడం ఒక్కటే మార్గమని అటు కమ్యూనిస్టు నేతలు అంటున్నారు. 

Leave A Reply

Your email address will not be published.