కరీంనగర్ : ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బియ్యం ఎగుమతి చేస్తున్నామని, ఇందులో ఎటువంటి అక్రమాలు చేయడం లేదని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ లు తెలిపారు. గురువారం కరీంనగర్లోని రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఖరీప్, రబీ సీజన్ లో ప్రభుత్వం అప్పజెప్పిన ధాన్యాన్ని మరాడించి ఎఫ్ సి ఐ నిబంధనల మేరకే అందజేస్తున్నామని తెలిపారు. రైస్ మిలర్లు ఎదుర్కొంటున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే ప్రభుత్వానికి బియ్యం అందజేసామని తెలిపారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించి విక్రయించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో రాజకీయాలు తగదన్నారు. గోడౌన్లలో బియ్యం ఉంచడానికి ఖాళీ లేకపోవడం వంటి కారణాలతో ఇప్పటికీ 50 శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించామని, అందులో మిల్లర్ల తప్పేమీ లేదన్నారు. ఇప్పటికీ మిల్లుల్లో గుట్టల కొద్దీ ధాన్యం ఉందన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ బియ్యం ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బియ్యం వ్యాపారమే జరగలేదని, ఇటీవలే తాము కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా ఇతర రాష్ట్రానికి పంపిస్తే రాజకీయాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తిస్తున్నారని, రైస్ మిల్లు ఇండస్ట్రీపై అపోహలు సరికాదన్నారు. ఎంతో మంది కార్మికులకు, పరోక్షంగా రైతులకు లాభం చేకూరుస్తున్న రైస్ మిల్లు ఇండస్ట్రీని మెరుగుపడేలా చూడాలని కోరారు.