A place where you need to follow for what happening in world cup

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ను కలిసిన ప్రధాని మోదీ.. ఆసక్తికర వ్యాఖ్యలు

జీ7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బిజీబిజీగా గడిపారు. పలు సెషన్లలో పాల్గొనడంతో పాటు పలువురు దేశాధినేతలను కూడా కలిశారు. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని మోదీ కలిశారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరువురూ కాసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. వీరి సమావేశంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలవడం ఎల్లప్పుడూ సంతోషకరమే. మెరుగైన ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు భారత్-అమెరికా ఉమ్మడిగా పాటు పడుతూనే ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ఇరువురి కలయికకు సంబంధించిన ఫొటోలను మోదీ షేర్ చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడితో భేటీకి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఇంధనం, రక్షణ, పరిశోధన, సాంస్కృతికంతో పాటు వివిధ రంగాలలో సహకార ప్రయత్నాలపై ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పురోగతి ఉందని అధ్యక్షుడు మేక్రాన్ ఆనందం వ్యక్తం చేశారు.

భారత్-ఫ్రాన్స్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడంలో అవరోధంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా రక్షణ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో నిబద్ధతను పాటించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. జీ7 సదస్సులో భాగంగా యూకే ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా మోదీ కలిశారు. జూన్ 13-15 మధ్య ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.