A place where you need to follow for what happening in world cup

ఈటలకు ఢిల్లీ నుంచి ఫోన్ ?

అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!
హైదరాబాద్ జూన్ 27: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రము లో ఏ నోట విన్న ఈటల.. ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది.. గత కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో నెలకొన్న పరిస్థితులతో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు..? కీలక నిర్ణయమే తీసుకుంటారా..? గత కొన్నిరోజులుగా ఆయన అసంతృప్తితో రగిలిపోతుండటానికి కారణాలేంటి..? బీజేపీలో కంటిన్యూ అవుతారా.. లేకుంటే కాంగ్రెస్ గూటికి చేరుతారా..? లేకుంటే ఈటల సతీమణి జమున  ఒక్కరే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారా..? ఇన్నిరోజులుగా ఊరించిన కీలక పదవి కథేంటి..? పొమ్మనలేక పొగపెడుతున్నారన్న వార్తల్లో నిజమెంత..? బీజేపీలో కంటిన్యూ అవుతూనే తనకున్న చేరికల కమిటీ పదవికి రాజీనామా చేస్తారా..?

ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈటల దంపతుల నుంచి సమాధానాలు వస్తాయని అభిమానులు అనుకున్నారు కానీ.. సడన్‌గా ఈటల తన తన ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ పొలిటికల్ డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది.. అయితే జమున మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. దీంతో ఆమె ఏం మాట్లాడుతారు..? కీలక ప్రకటన ఏమైనా ఉంటుందా..? అని కార్యకర్తలు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.కొద్దిరోజుల క్రితం దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్నాటక ఎన్నికల్లో విజయం తర్వాత ఒక్కసారి పరిస్థితులు మారిపోయాయి. మరోవైపు.. దూకుడు మీదున్న బీజేపీ డీలా పడిపోయింది. నేతలు ఎప్పుడెలా అడుగులేస్తారో తెలియని పరిస్థితి. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నాక రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఈటల దంపతులిద్దరూ మీడియా ముందుకు రావాలనుకున్నారు.

దీంతో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీలో నెలకొన్న పరిస్థితులు, అసలు బీజేపీలో కొనసాగే పరిస్థితి ఉందా లేదా..? అసలు అందరూ అనుకున్నట్లుగా ఆ కీలక పదవి సంగతేంటి..? ఇలా అన్ని విషయాలపై ఈటల మాట్లాడుతారని అందరూ భావించారు కానీ.. ఎందుకో రాజేందర్ సడన్‌గా ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి.. ఈటల కాంగ్రెస్‌లో చేరాలని చాలా రోజులుగా అనుచరులు, అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.. రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. పైగా ఇప్పుడు బీజేపీలో కూడా పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రెస్‌మీట్ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ ప్రెస్‌మీట్‌తో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుందని అభిమానులు, అనుచరులు భావించారుగానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈ గ్యాప్‌లో ఢిల్లీ నుంచి ఒకరిద్దరు అగ్రనేతలనుంచి ఫోన్ కాల్ రావడంతో ఈటల ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నారని తెలియవచ్చింది. అయితే ఆ ఫోన్‌కాల్‌లో ఏం మాట్లాడుకున్నారు..? ఏమైనా హామీ ఇచ్చారా.. పార్టీ మార్పు విషయంపై ఆరాతీశారా..? అనేది తెలియట్లేదు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పర్యటనతో ఈటల ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నారని.. ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుందనేదానిపై తెలుసుకుని ఆ తర్వాత మీడియా ముందుకు రావాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.