A place where you need to follow for what happening in world cup

ఆలేరు బరిలో మోత్కుపల్లి…?

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కుండ బద్దలుకొట్టారు. ఆలేరు నుంచి ఆయన పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆలేరు నియోజవకర్గంలో ఏం జరగనుంది? మూడో సారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించాలని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు ఈ సారి ఎదురుకానున్న సవాళ్లు తప్పవా? ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులంతా ఆమె వెనకే ఉన్నారా?. 1952 నుంచి 1972 వరకు జనరల్ స్థానంగా ఉన్న ఆలేరు నియోజకవర్గం 1978 ఎన్నికల సమయంలో ఎస్సీలకు రిజర్వు అయ్యింది. తిరిగి 2009 ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానం అయ్యింది. ఒక ఉప ఎన్నిక సహా ఆలేరుకు ఇప్పటి దాకా 16 ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా.. వరసగా అయిదుసార్లు విజయం సాధించిన రికార్డు మాత్రం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుదే. ప్రస్తుతం ఆయన అధికార బీఆర్ఎస్ లో ఉన్నారు.

ఈసారి ఎన్నికల్లో పోటీ కోసం ఆలోచిస్తున్నారని మోత్కుపల్లి సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేరును ఖరారు చేసింది.ఆలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. 1983 నుంచి 1999 వరకు అయిదు సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి… మూడు సార్లు టీడీపీ నుంచి, ఒక సారి ఇండిపెండెంటుగా, మరోసారి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఆలేరు జనరల్ స్థానం కావడంతో పొరుగునే ఉన్న తుంగతుర్తి ఎస్సీలకు రిజర్వు కావడంతో అక్కడికి వలస వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడైన మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది.టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ కు, అక్కడి నుంచి తిరిగి టీడీపీకి, అటు నుంచి అటు బీజేపీకి.. అక్కడ ఇమడలేక బీఆర్ఎస్ గూటికి చేరారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులు సేవలు వినియోగించుకుంటామని బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ మోత్కుపల్లి చేరిక సందర్భంగా ప్రకటించడంతో ఎమ్మెల్యేగా ఎక్కడా సర్దుబాటు చేయలేకపోతే, ఎమ్మెల్సీ పదవైనా దక్కుతుందని అంతా భావించారు. మోత్కుపల్లి అనుచరులు సైతం ఇదే ఆశించారు. కానీ, పార్టీలో చేరిన తర్వాత ఒకటీ రెండు సార్లు మినహా మళ్లీ సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశమే మోత్కుపల్లికి దక్కలేదని చెబుతున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన నర్సింహులు అధినాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.ఆలేరు నుంచి ఇప్పటికే రెండు సార్లు విజయాలు సాధించి మూడో గెలుపు కోసం ఎదురు చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు టికెట్ ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ఇక్కడి నుంచి తమకే టికెట్ కావాలని డిమాండ్ చేసిన నాయకుడు కానీ, సునీతకు ఇచ్చిన టికెట్ వాపస్ తీసుకుని కొత్త అభ్యర్థిని ప్రకటించాలని కానీ కోరిన అసమ్మతి నాయకుడు లేడు. అయితే ఇటీవల ఆలేరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సునీత, ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మోత్కుపల్లి నర్సింహులు సైతం హాజరయ్యారు.

సీనియర్ నాయకుడిగా ఆయనకు ప్రసంగించే అవకాశం ఇచ్చారు. మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేస్తోంది మోత్కుపల్లి కోడలే కావడంతో ఆయనను మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ సమయలోనే ఆయన తన మనసులోని మాట బయట పెడుతూ.. నేనైతే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. మీరంతా నావెంట ఉంటారా? ఉండరా? సహకరిస్తారా? లేదా? అంటూ చేసిన ప్రసంగంపై చర్చ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఎన్నికలకూ టికెట్ పొందిన సునీత సమక్షంలోనే ఆయన తన పోటీపై కుండ బద్దలు కొట్టడంతో చర్చ జరుగుతోంది? మోత్కుపల్లి నర్సింహులు ఏం చేయబోతున్నారు? నిజంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఏ పార్టీ నుంచి? లేదా ఇండిపెండెంట్ గా చేస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.