పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలపై, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కరీంనగర్ ,సిరిసిల్ల జిల్లా పార్టీ సంయుక్తంగా స్థానిక డిసిసి కార్యాలయంలో ఆదివారం మంత్రి పొన్నం నిరసన దీక్ష చేపట్టారు. కార్యకర్తలనుద్దేశించి మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ గ్యారంటీ ల గురించి అడుగుతున్నారని, వారు కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగేముందు గత పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ అవుతాయని చెప్పారని నల్ల ధనాన్ని బయటకు తెస్తామని చెప్పారని, ఎవరి ఖాతాలోనైనా జమ అయ్యాయా అని ప్రశ్నించారు. దేశంలో రైతులకు పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతూ వెయ్యి మందికి పైగా చనిపోయారని మండిపడ్డారు.
దీనిపై కనీసం స్పందించని తెలంగాణ బీజేపీ నాయకులు నేడు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు..ఎంత మందికి ఇచ్చారు. ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అప్పటి ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక పరిశ్రమలు స్థాపించారని గుర్తుచేశారు. వాటిని మీరు ఆదానీ, అంబానీలకు దారదత్తం చేస్తోందని మండిపడ్డారు. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలు ఎందుకు అమలు చేయ లేదని ప్రశ్నించారు. సీలేరు ప్రాజెక్ట్ , 7 మండలాలు ఆర్డిన ెన్సు ద్వారా గుంజుకుపోయారని, వైద్య కళాశాలలు, నవోదయ విద్యాలయాలను తీసుకురాలేదని మండిపడ్డారు. వస్త్ర పరిశ్రమ మీద స్వతంత్రం వచ్చిన తరువాత మొదటిసారిజీఎస్టీ వేసిందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఎస్ ఐడీపీ కింద అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడు మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని ఆరోపించారు.
బండి సంజయ్ ఇటీవల తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడని విమర్శించారు. తల్లి గురించి మాట్లాడిరడంటే రాజకీయ సమాధి కావాల్సిందేనని అన్నారు. ఇద్దరం ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేశామని, ఎవరు ఏం చేశారో చెప్పుకుందామని సవాల్ విసిరారు. అక్షింతల పేరు మీద.. మతాల పేరు మీదనోకాదు.. కేంద్రం నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా ఉండేలా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయాల.. తిరుపతికి రైలు, పాస్ పోర్ట్ కార్యాలయం, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, టూరిజం ప్రాజెక్టులు ఏం తెచ్చారో చెప్పాలన్నారు.నేషనల్ హైవే జీవో తానే తీసుకొచ్చానని తెలిపారు. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని అంతా కోడై కూస్తోందని విమర్శించారు. 2014 లో బీజేపీకి 110 సీట్లకు, 2018 లో 100 సీట్లకు, ఇటీవలి ఎన్నికల్లో 70 సీట్లకు డిపాజిట్ రాలేదని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకోకుండా.. రాముడి ఫొటో పెట్టుకొని వోట్లు అడుగుతున్నారని, మీ ప్రధాని పరువు దిగజారిపోయిందా అని ప్రశ్నించారు.
మా నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఫొటోస్ పెట్టుకొని వోట్లు అడుగుతున్నామని తెలిపారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే మా నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి మహరాష్ట్ర వరకు జోడోయాత్ర చేపట్టారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, విద్వేషాలు రెచ్చగొట్టే వారికి చరమ గీతం పాడాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ దీక్ష ద్వారా బీజేపీ కి చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోరకు కేంద్రం నుంచి తెలంగాణకి ఏం ఇచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. మీకు చిత్తశుద్ది ఉంటే.. కరువు నుంచి రైతులను కాపాడేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం కింద కేటీఆర్ రూ.25వేలు ఇవ్వాలని అంటున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రూ.2500 అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
వచ్చే 40-50 రోజులు కార్యకర్తలు కష్టపడాలని, పార్టీ గెలుపుకోసం సైనికుల్లా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్, నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్ కె. నరేందర్ రెడ్డి , జిల్లా ఇన్చార్జ్ నరసింహారెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఒడిదల ప్రణవ్, కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జ్ కురుమళ్ళ శ్రీనివాస్, మహిళా నాయకురాలు, పార్లమెంట్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.