- మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న ప్రధాని
- మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆవేదన
- క్షమించరాని నేరం, నిందితులను వదలబోమని స్పష్టత
- పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ
మణిపూర్ లో కొంతకాలంగా జరుగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గురువారం పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని.. కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై మోదీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిశాక తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు.
ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు సంబంధించి.. ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. మణిపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ.. మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమని, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.