- నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారన్న కేటీఆర్
- నేడు రైతులకు 3 గంటల కరెంట్ చాలంటున్నాడు ఛోటా చంద్రబాబు అంటూ విమర్శ
- ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్రను కాంగ్రెస్ చేస్తోందని మండిపాటు
తెలంగాణలో ఎక్కువ మంది రైతులు మూడెకరాల లోపు ఉన్నవారేనని… అలాంటప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ… రేవంత్ ను ఛోటా చంద్రబాబు అని అభివర్ణించారు.
కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక!!
కాంగ్రెస్ వస్తే… నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు. నేడు మూడు పూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు.
మూడు ఎకరాల రైతుకు.. మూడు పూటలా కరెంట్ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే. కాంగ్రెస్ కు ఎప్పుడూ.. చిన్నకారు రైతు అంటే చిన్నచూపు. సన్నకారు రైతు అంటే సవతిప్రేమ. నోట్లు తప్ప… రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం. అన్నదాత నిండా మునుగుడు పక్కా.
నాడు.. ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్.. నేడు ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది. మూడు గంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం. మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.
తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!! రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా??” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.