తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్ కు తెలంగాణలో 65 లక్షల మంది జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి చెందిన ఒక్క బిడ్డా కూడా కనిపించక పోవడం కెసిఆర్ అహంకార ధోరణికి నిదర్శనం అని ముదిరాజ్ మహాసభ యువత జిల్లా అధ్యక్షుడు పోతరవేని క్రాంతి ముదిరాజ్ అన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులతో కలిసి క్రాంతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ముదిరాజ్ సోదరులు వలలు తోపెళ్ల తోని, మా ముదిరాజ్ ఆడబిడ్డలు నెత్తిన బోనాలు ఎత్తుకొని ఎండనక వాననక తెలంగాణ సాధన పోరాటంలో ముఖ్యభూమిక పోషించిన విషయం కెసిఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు.
ఆనాడు నీతో వెన్ను దన్నుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ముదిరాజ్ బిడ్డా అయిన ఈటెల రాజేందర్ కి ప్రజల్లో మంచి పేరు వస్తుందని అతను ఎక్కడ ఎదిగి పోతాడో అని ముదిరాజ్ కులంలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మేల్యే ను ఎన్నో అవమానాలకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి నీ టిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లగొట్టినవని ఆరోపించారు.
ముదిరాజ్ లు నీకు ఎప్పుడు ఓట్లు వేసి గెలిపించాల్సిందే కానీ రాజ్యా చేపట్టడానికి అనర్హులు అనే నీ దొర అహంకార పాలన ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందన్నారు.
ఎన్నికలు సమయం దగ్గర కావడం దళిత బంధు అని, బిసి బంధు అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుంటివి..ఆ బిసి బంధులో ముదిరాజ్ లకు చోటే లేదన్నారు. ఎందుకు పెట్టలేదు అని అడిగితే ముదిరాజ్ లకు చేప పిల్లలు బండ్లు వ్యాన్లు ఇస్తున్న అంటివి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇస్తున్న పథకం కాదా అని ప్రశ్నించారు. మత్స్యశాఖ లో ఒక్క ముదిరాజ్ లే ఉండరు కెసిఆర్ అందులో మా దళిత సోదరులు, బెస్త సోదరులు అందరూ ఉంటారని, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాన్ని నువ్వు ఇస్తున్నట్లుగా తెలంగాణ ముదిరాజ్ సోదరులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఆనాడు నువ్వు నీ అల్లుడు హరీష్ రావు ఒక మాట అన్నారు పాండవులు ఎటు వైపు ఉంటే విజయం అటు వైపే అని దాన్ని మేము నిజం చేస్తూ ముదిరాజ్ లు అందరూ ఒక్కటై ఐకమత్యంతో నిన్ను గద్దె దించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మంథని మండల అధ్యక్షులు గుండా రాజు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకులు సబ్బని సమ్మయ్య, పోలు శివ,నరెడ్ల కిరణ్,వీరబోయిన రాజేందర్,పోతరవేని నడిపి రాజు,జెట్టి చందు,జెట్టి శంకర్,బండారి ప్రసాద్, సబ్బాని రాజేష్ అధిక సంఖ్యలో ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.