A place where you need to follow for what happening in world cup

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి
అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం
ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి
లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి
పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన
ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల
త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం
రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టీజేఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌రిటైర్డ్ ఇం‌జినీర్లు

ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 03 : ‌కాళేశ్వరం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని, లేనిపక్షంలో తాను బయటపెడతామని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్‌లకు పరిష్కార మార్గాలు ఏమిటి?’ అన్న అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం జరిగింది. ఇందులో రిటైర్డ్ ఇం‌జినీర్లు, మేథావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సమావేశానికి హాజరైన ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్‌ ‌సేఫ్టీ రిపోర్ట్ ‌బయట పెట్టి, ప్రాజెక్టు అధ్భుతాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగల్భాలు ఆపాలన్నారు. సీఎంనే అన్ని పనులు చేస్తానంటే ఎట్లా అని ప్రశ్నించారు. కాళేశ్వరం సర్వే చేయలేదని, ఉంటే రిపోర్ట్‌లు బయట పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. గిన్నీస్‌ ‌రికార్డు కోసమే కాళేశ్వరం కట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టే అంతిమ సాక్ష్యం అన్నారు.

రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకపోవడమే కారణమని తెలుస్తుందన్నారు. పై నుంచి ఆదేశాలతోనే పాలన నడుస్తుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల ప్రాజెక్టులు ధృడంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం కారణంగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. డ్యామ్‌ ‌సేఫ్టీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజలముందు ప్రభుత్వం ఉంచాలని, లేదంటే తామే ప్రజలముందు ఉంచుతామన్నారు. రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ ‌రమేష్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…నదిపై స్టడీ చేయకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం సరికాదన్నారు. రిటైర్డ్ ఇం‌జినీర్లపై ఆధారపడి కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడంపై ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అంతర్జాతీయ టూరిజం కోసమే కట్టారని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌నర్సింహారావు మాట్లాడుతూ మేడిగడ్డ చాలా క్రిటికల్‌ ‌ప్రాజెక్టు అని, బ్యారేజ్‌లు 5 టీఎంసీల వరకే నిర్మిస్తారని అన్నారు. డెల్టా ప్రాంతంలోనే వీటిని కడతారని, కాళేశ్వరంలో డిజైన్‌ ‌డైవర్షన్‌ ‌మెంట్‌ ‌లేదన్నారు. రికార్డ్ ‌కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు. మేడిగడ్డను స్టోరేజ్‌ ‌చేయని పక్షంలో ఎప్పుడూ ఫ్లష్‌ ‌చేస్తూ ఉండాలన్నారు. త్రిశంకు స్వర్గంలా కాళేశ్వరం ఉందన్నారు. ప్రాజెక్టుపై రీ స్టడీ చేయాలన్నారు.

సీనియర్‌ ‌జర్నలిస్టు విజయసారథి రెడ్డి మాట్లాడుతూ…డ్యామ్‌ ‌సేఫ్టీ యాక్ట్ 2021 ‌ప్రకారం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. లేదంటే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించి ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థపై, బాధ్యులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని అన్నారు. ఎన్నికల వేళ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కుతోనే కాళేశ్వరంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయన్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, లేదంటే కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రిటైర్డ్ ఇం‌జినీర్‌ ‌రంగారెడ్డి మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు. ప్రాజెక్టును తొందరగా, తక్కువ కాలంలో ప్రభుత్వం నిర్మించడంతోనే లోపాల సమస్యలు తలెత్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు థియరీ, ప్రాక్టికల్‌కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టును కేంద్రం రీ చెక్‌ ‌చేయించాలన్నారు. తెలంగాణలో మంచి ఇంజినీర్ల ఉన్నారని, వారికి ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఇం‌జినీర్‌ ‌రఘుమారెడ్డి మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టు సర్వేనే సరిగా చేయలేదన్నారు. ఎల్‌ అం‌డ్‌ ‌టి సంస్థను నిందించడం తగదన్నారు. తప్పు ఉంటే రీ సర్వే చేయాలన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టి కాళేశ్వరం కట్టారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సీజ్‌ ‌చేసి బాధ్యులైన ఇంజినీర్లు, అధికారులను జైల్లో పెట్టాలన్నారు. రాఫ్ట్ ‌పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్లా నిర్మించాలన్నారు. లక్ష యాభై వేల కోట్ల నిధులు నాశనం చేసిన దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రిటైర్డ్ ఇం‌జినీర్‌ ‌శ్యామ్‌‌ప్రసాద్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…వాటర్‌ ‌ఫ్లో కంటిన్యూటీ ఉన్న చోటనే బ్యారేజ్‌ ‌నిర్మించాలని, కానీ మేడిగడ్డను బ్యారేజ్‌ ‌రూపకంగా రిజర్వాయర్‌గా నిర్మించారన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్లు అయినా పరిశీలన చేయలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రెక్టిఫికేషన్‌ ‌చేయించాలని, దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు. సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాశం యాదగిరి మాట్లాడుతూ…కాళేశ్వరం అంటే కేసీఆర్‌ ‌ఖజానా కాళీశ్వరం అని ఇద్దేవా చేశారు. కేసీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు. కాళేశ్వరం డీపీఆర్‌ ‌లేదని, కాళేశ్వరం లోపాలకు ప్రభుత్వం, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థనే దోషులని అన్నారు. లిక్కర్‌(‌బీఆర్‌ఎస్‌) ‌పార్టీ, నిక్కర్‌(‌బీజేపీ)పార్టీలు ఏకమైయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద కుంభకోణమన్నారు. సోషల్‌ ‌మీడియా ఫోరం అధ్యక్షుడు దేశాయ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షాల పాత్ర ఉందన్నారు. ఈ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. ప్రాజెక్టు లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం కూడా బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్‌ ‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్‌, ‌ట్రెజరర్‌ ‌సురేష్‌, ‌రిటైర్డ్ ఇం‌జినీర్లు, మేధావులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.