A place where you need to follow for what happening in world cup

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి
తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి
50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి
గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి
నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం
ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల తాకులాటలు పెట్టాలని కాంగ్రెస్‌ ‌కోరుకుంటున్నది
కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఏ ‌దేశాలయితే ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించాయో ఆ దేశాలు అభివృద్ధిలో చాలా ముందుకు సాగుతున్నాయని, మనం కూడా పరిణతిని ప్రదర్శించి వోటు వేస్తే..మంచి తీర్పు వొచ్చే అవకాశం, మంచి ప్రభుత్వం వొచ్చే అవకాశం ఉంటదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అందుకే అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్ర చూసి మాత్రమే వోటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…ఎలక్షన్లు వొస్తే గందరగోళంగా ఉంటదని, ఆలోచన తక్కువ.. గడబిడ ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఆలోచించి వోటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీల నడవడిక, అభ్యర్థుల గుణగణాలను బేరిజు వేసుకొని ఏ పార్టీకి వోటు వేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రజలకు ఏమి జరిగిందో.. టిఆర్‌ఎస్‌ ‌పదేండ్లపాలనలో ప్రజలకు ఏం చేసిందో బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. గతంలో మంచినీరు, సాగునీరు లేక వలసలు, కరువు కాటకాలతో తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉండేదని కేసీఆర్‌ అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి వొచ్చిన సమయంలో ఈ ప్రాంతమంతా తిరిగి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నానని.. నాడు బండలింగాపూర్‌ ‌ప్రాంతంలో చెరువు వద్దకు వెళ్తే నీటి చుక్క లేక ఎడారి ప్రాంతాన్ని తలపించిందని అన్నారు.
image.png
ప్రస్తుతం పదేండ్ల టిఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణలో ఎక్కడ కరువు కాటకాలు లేకుండా 24 గంటల విద్యుత్తుతో పాటు మంచినీరు, సాగునీరు అందజేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేశామని కేసీఆర్‌ ‌చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలన.. పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలను బేరిజు వేసుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని వోటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. నువ్వు గుల్లే నేను సల్లే..’ అన్నట్లుగా ఉంటుందని అట్లా బతుకులను ఆగం చేసుకోవద్దని ప్రజలను కోరారు. గుడ్డిగా వోటు వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వోటర్లు పరిణతి ప్రదర్శించాలని పదేపదే చెప్పారు. గతంలో సిరిసిల్ల, భూదాన్‌ ‌పోచంపల్లి, దుబ్బాకలలో చేనేత కార్మికులు ప్రతిరోజు 6, 7 గురు చొప్పున మరణించేవారని, ఒకరోజు భూదాన్‌ ‌పోచంపల్లిలో ఏడుగురు చనిపోతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికులను ఆదుకోవాలని 50 వేల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి చేనేత కార్మికుల పరిస్థితులను అవగాహన చేసుకున్నాను కనుకనే చేనేత కార్మికుల కోసం వారి అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం సిరిసిల్లలో చేనేత కార్మికులకు 50 శాతం రాయితీ కింద అవసరమైన సామాగ్రిని అందిస్తున్నామని, వారిని మరింతగా ఆదుకునేందుకు వొచ్చే ప్రభుత్వంలో మరింతగా బడ్జెట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి ఎన్నో రోజులు ఆలోచించి పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశామని అన్నారు. గతంలో ప్రభుత్వాలు తమాషాకు పెన్షన్లు ఇచ్చేవని డెబ్బై, రెండు వందలు ఇస్తే దేనికి సరిపోలేదని, తమ ప్రభుత్వం వాటిని వేల రూపాయలకు పెంచిందని అన్నారు. ఇవే కాకుండా వొచ్చే ప్రభుత్వంలో మరింతగా పెన్షన్లను పెంచే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు ముఖ్య మంత్రి తెలిపారు. 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేయడం లేదని కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. వారి కష్టసుఖాలు తెలుసు కాబట్టి బీడీ కార్మికుల బాధలను, బీమారులను కళ్లారా చూశాను కాబట్టే వారికి పెన్షన్లను అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో కూడా ఎన్నికలల్లో హామీలు కొన్ని మాత్రమే ప్రకటించినా,  తర్వాత కాలంలో చెప్పకుండానే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినట్లు ముఖ్యమంత్రి అన్నారు. 2000 రూపాయల పెన్షన్‌ను బీడీ కార్మికులకు 5000 అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
image.png
కొత్తగా బీడీలు చేస్తున్న కార్మికులకు అందరికీ పెన్షన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. గతంలో వరద కాలువలకు మోటర్లు పెడితే పైపులు కోసేసేవారని, ఇప్పుడు 2, 5 హెచ్పి మోటర్లు పెట్టినా.. ఎంత నీరు వాడుకున్నా..  ఎవరైనా అడుగుతున్నారా అని రైతులను ప్రశ్నించారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్తును వ్యవసాయ రంగానికి అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు బాగుండాలని సదుద్దేశంతోనే రైతంగానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నట్లు కేసీఆర్‌ ‌వెల్లడించారు. నీటి తీరువాను రద్దు చేయడంతో పాటు విద్యుత్తు బకాయిలను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జుట్లు జుట్లు ముడేసి తాకులాట పెట్టేలా ధరణిని తీసివేయాలని కాంగ్రెస్‌ ‌నాయకులు అవాకులు చెపాకులు పేలుతున్నారని, ధరణిని బంగాళాఖాతంలో పారేయాలని అంటున్నారని.. ఇది మీకు సమ్మతమే అన్న అని ప్రజలను కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ ‌వల్లనే రైతులకు రైతు బీమా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు సక్రమంగా రైతులకు అందేటట్లు ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. ధరణిని తీసివేస్తే గ్రామాలలో విఆర్వోలు, వ్యవసాయ అధికారులు రైతుబంధు ద్వారా డబ్బులు జమైతే తమకు లంచం ఇవ్వాలని జూలుం ప్రదర్శించే వసూలు చేస్తారని, ఇది మీకు సమ్మతమేనా అని రైతులను ప్రశ్నించారు.
రైతుబంధును ఎకరానికి 16,000 అందించనున్నట్లు కేసిఆర్‌ ‌వెల్లడించారు. 93 లక్షల మంది రేషన్‌ ‌కార్డుల ద్వారా వారికి సన్నబియాన్ని అందించనున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు వద్దని కేవలం మూడు గంటల కరెంటు మాత్రమే సరిపోతుందని మూడు గంటల కరెంటు ద్వారా పంట పొలాలకు సాగునీరు అందుతాయా.. 24 గంటల కరెంటు కావాలా.. అని రైతులను కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌నాయకుల మాయలో పడితే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్లే అవుతుందని ప్రజలు ఆలోచించాలని కోరారు. పవిత్రమైన వైద్య వృత్తిని విడిచిపెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చిన కోరుట్ల నియోజకవర్గం టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల సంజయ్‌ ‌ను గెలిపించి ప్రజాస్వామ్య పరిణితి ప్రదర్శించాలని ఓటర్లకు కేసీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో 2014లో దేశంలో తెలంగాణ 14, 15 వ స్థానంలో ఉంటే ప్రస్తుతం దేశంలో 3.18 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌స్థానానికి ఎదిగిందని అన్నారు. విద్యుత్‌ ‌వినియోగంలో కూడా తెలంగాణ దేశంలో మొదటి స్థానానికి చేరిందని కేసీఆర్‌ ‌వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.