ప్రజలు లోక్ అదాలత్ పై అవగాహన కలిగి ఉండాలి:తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. పి. సామ్ కోషి.
-సమన్యాయం సత్వర న్యాయం ఇదే లోక్ అదాలత్ ధ్యేయమని
-ప్రజలు లోక్ అదాలత్ పై అవగాహన కలిగి ఉండాలని
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. పి. సామ్ కోషి అన్నారు. శనివారం భువనగిరి జిల్లా కోర్టు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా భువనగిరి జిల్లా కోర్టు లో జిల్లాలోని న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారుల తో న్యాయవాద ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వివిధ కోర్టులలో ఉన్నటువంటి పెండింగ్ సివిల్, క్రిమినల్, ప్రి లిటిగెషన్ కేసులను సత్వరంగా పరిష్కరించి తద్వారా కక్షిదారులు వారి సమయాన్ని డబ్బును ఆదా చేసుకొని కుటుంబ ప్రగతికి తోడ్పడే అవకాశం ఉన్నదని అన్నారు.
చిన్నచిన్న తగాదాలను పెద్దదిగా చేసుకోవడం వలన సంఘంలో మనిషి మనుగడలో తీవ్ర నష్టం జరిగి మానవత సంబంధాలు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. సెప్టెంబర్ నెల 9వ తేదీన జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసులు పరిష్కారం అయ్యాయని దక్షిణ భారత దేశం లో తెలంగాణ రెండవ స్థానాన్ని సాధించిందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు త్వరలోనే మధ్యవర్తిత్వ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ లోక్ అదాలత్ లలో పోలీసు వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థలలో ప్రి లిటిగెషన్ కేసుల ద్వారా కోర్టుముందుకు రాకముందే వాజ్యాలను ఒకే దఫాలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవచ్చని, వచ్చే డిసెంబర్ తొమ్మిదవ తేదీన జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసులను పరిష్కరించే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం, న్యాయవాదులు అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు కృషి చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయ సేవా అధికార సంస్థ చట్టం ప్రజలకు చేరువలో ఉండి అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం, న్యాయవిజ్ఞానం అందిస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మారుతీ దేవి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న పాత కేసులు పరిష్కరించడంలో, రాజీకి ఆమోదయోగ్యమైనటువంటి అన్ని కేసులను పరిష్కరించి తద్వారా ఈ జిల్లా ఉన్నతికి జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు. భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య మాట్లాడుతూ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించబడడం ఒకరకంగా రాజ్యాంగ వ్యవస్థను పటిష్ట పరిచినట్లే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికారసంస్త కార్యదర్శి కె. మురళి మోహన్ వందన సమర్పణ చేశారు.
అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత మరియు వర్చువల్ విధానం ద్వారా రామన్నపేట న్యాయమూర్తులు ప్రదీప్, చందన, ఆలేరు న్యాయమూర్తి సుమలత, చౌటుప్పల్ న్యాయమూర్తి మహతి వైష్ణవి, యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రాజేష్ చంద్ర, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పి. ఎస్.సత్యనారాయణ, ప్రభుత్వ న్యాయవాదులు బి కేశవరెడ్డి, బాబురావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగార్జున పాల్గొన్నారు.