హైదరాబాద్, జూన్ 30:ఓటీటీ ప్రపంచంలో దర్శకుడు మహి వి. రాఘవ్ పేరు మారు మోగుతోంది. ఆయన సృజనాత్మక ఆలోచన నుంచి వచ్చిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. భార్యల కారణంగా భర్తలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో, కామెడీ ప్రధానంగా రూపొందింది. జనాలను అమితంగా నవ్వించింది. ఇక… మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సైతాన్స్’ పాన్ ఇండియా స్థాయిలో జనాలకు షాక్ ఇచ్చింది. అందులో సంభాషణలు, హత్యలు, శృంగారాత్మక సన్నివేశాలపై చాలా చర్చ జరిగింది. ఓటీటీల్లో కాదు… ఇప్పుడు రాజకీయ పరంగానూ మహి పేరు మారు మోగుతోంది. కరోనా కారణంగా లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దర్శకులలో మహి వి. రాఘవ్ కూడా ఉన్నారు. కరోనా కాలంలో కొన్ని కథలు రాశారు. స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేశారు. ‘సేవ్ ద టైగర్స్’, ‘సైతాన్’ ఆ కథల్లోనివే. ఈ రెండూ కాకుండా ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ అని ఓ సినిమా కూడా తీశారు.
అది త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు మహి వి. రాఘవ్ ఏం చేయబోతున్నారు? అంటే… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంగా ఆధారంగా తీయబోయే ‘యాత్ర 2’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ తీశారు మహి వి. రాఘవ్. ‘యాత్ర 2’లో వైయస్సార్ తనయుడు జగన్ మొగం రెడ్డి చేసిన పాదయాత్రను చూపించబోతున్నారు. తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది? అనేది చూపించబోతున్నారు. దాంతో ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకులలో మాత్రమే కాదు… రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది. ‘యాత్ర 2’లో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారు? తొలుత తమిళ స్టార్ హీరో సూర్య నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే… చివరకు యువ తమిళ కథానాయకుడు జీవా దగ్గర ఆగింది.
జూలై 8… వైయస్సార్ జయంతికి ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.’రంగం’ సినిమాతో తెలుగులోనూ జీవా హిట్ అందుకున్నారు. తెలుగులో పలు హిట్ చిత్రాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కుమారుడే ఆయన. ఆల్రెడీ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన అనుభవం ఉంది. టీమ్ ఇండియా తొలి వరల్డ్ కప్ విజయంపై రూపొందిన ’83’ సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించారు. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘యాత్ర 2’ విడుదల చేయాలనే సంకల్పంతో మహి వి రాఘవ్ ఉన్నారట. సో… త్వరలో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. దీని కంటే ముందు ఆయన నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. అదేనండీ… ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’. అది సెటైరికల్ కామెడీ సినిమా.